ప్రభుత్వాలను గద్దె దించే వరకూ పోరాటం

Feb 25,2024 23:36
సిపిఐ

సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం
కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన సమయం ఆసన్నమైందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ అన్నారు. ఆదివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకొచ్చిన నాటి నుంచి దేశంలో కుల, మత ఘర్షణలు పెరిగిపోతున్నాయన్నారు. ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పుల్వామా ఘటన నుంచి మణిపూర్‌ అల్లర్ల వరకు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో 2014లో అధికారంలోకొచ్చిన టిడిపి, 2019లో అధికారంలోకొచ్చిన వైసిపి కూడా కేంద్రంలో బిజెపికి తొత్తులుగా మారాయని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన వాటాలను తీసుకురావడంలో ఇరు పార్టీలు విఫలమయ్యాయన్నారు. మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని దానికి సిఎం ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. 2019లో బిజెపితో తెగ తెంపులు చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు ఎందుకు బిజెపితో పొత్తు కోసం తహతహలాడుతున్నారో రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉందన్నారు. బిజెపి ఏ పార్టీతోనైనా జతకడితే అది నీతివంతమని, ఇతర పార్టీలు జతకడితే అది అవినీతి మయమని మోడీ అనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో తాము కొనసాగుతున్నామని వెల్లడించారు. విభజన హామీలను అమలు చేయడంలో మోడీ తీవ్రంగా విఫలమయ్యారన్నారు. ఎపికి నష్టం చేసిన మోడీకి జగన్‌, చంద్రబాబు, పవన్‌ జత కట్టడం దారుణం అన్నారు . రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని ఆమె ప్రజలుకు పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి పాలనలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత బాగా పెరిగిందన్నారరు. ఈ సమావేశంలో నగర కార్యదర్శి వంగమూడి కొండలరావు, సహాయ కార్యదర్శి సప్పా రమణ, సేపెని రమణమ్మ, శ్రీనివాస్‌, టి.నాగేశ్వరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు .

➡️