NEET: బీహార్‌లో నీట్‌-యుజి ప్రశ్నాపత్రం లీక్‌

Jun 24,2024 23:54 #'NEET' irregularities, #Bihar
  •   లభించిన ఆధారాలు 
  •  పాట్నాకు సిబిఐ బృందం

పాట్నా : బీహార్‌లో నీట్‌-యుజి పరీక్ష ప్రశ్నాపత్రం లీక్‌ అయిందని రూఢ అయింది. ప్రశ్నాపత్రం ఫొటోకాపీ ఒక దానిని కొందరు వ్యక్తులు తగలబెట్టారు. ఆ చెత్తను బీహార్‌ ప్రభుత్వ ఆర్థిక నేరాల విభాగం క్షుణ్ణంగా పరిశీలించగా ప్రశ్నాపత్రంలో ఇచ్చిన 68 ప్రశ్నలు తగలబడిన ఫొటోకాపీలోనూ కన్పించాయి. ఈ సమాచారాన్ని బీహార్‌ ప్రభుత్వం కేంద్రానికి చేరవేసింది. తగలబడిన ప్రశ్నాపత్రంలో అధికారులకు పరీక్షా కేంద్రం కోడ్‌ కన్పించింది. అది సిబిఎస్‌ఇ అనుబంధ ఒయాసిస్‌ ప్రైవేటు పాఠశాలకు చెందినది. జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ఉన్న ఈ పాఠశాలలో పరీక్ష జరిగింది. ఈ ప్రశ్నాపత్రాన్ని ఓ ఇంటి నుండి బీహార్‌ పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్ట్‌ చేశారు. తగలబడిన ఫొటోకాపీని, అసలైన ప్రశ్నాపత్రాన్ని, అందులోని ప్రశ్నలను సరిపోల్చేందుకు అధికారులు ఫోరెన్సిక్‌ లేబొరేటరీ సాయం తీసుకున్నారు. ఆర్థిక నేరాల విభాగం అందించిన సమాచారం ఆధారంగానే కేంద్ర విద్యాశాఖ విచారణను సిబిఐకి అప్పగించింది. పేపర్‌ లీకేజీ కేసులో ఇప్పటి వరకూ 18 మంది అరెస్టయ్యారు. ఫొటోకాపీలోని ప్రశ్నల వరుస సంఖ్యలు, ఒరిజనల్‌ ప్రశ్నాపత్రంలోని ప్రశ్నల వరుస సంఖ్యలు కూడా ఒకేలా ఉన్నాయి. పేపర్‌ ఎక్కడ, ఎప్పుడు లీకైందో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అధికారులు రెండు రోజుల క్రితం ఒయాసిస్‌ పాఠశాలకు వెళ్లి ప్రశ్నాపత్రాలు ఉన్న పెట్టెలు, కవర్లను స్వాధీనం చేసుకున్నారు. ఓ కవరును తప్పుగా వేరే వైపు కత్తిరించారని వారు గుర్తించారు. పరీక్షా కేంద్రానికి చేరుకోక ముందే పేపర్లు లీక్‌ అయి ఉంటాయని పాఠశాల ప్రిన్సిపాల్‌ అభిప్రాయపడ్డారు.

బీహార్‌కు సిబిఐ బృందం
సిబిఐ బృందాలు సోమవారం బీహార్‌ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఇఒయు) కార్యాలయానికి చేరుకున్నాయి. నీట్‌ విచారణకు సిబిఐకి అప్పగించడానికి ముందు… ఇఒయు ఈ కేసులో దర్యాప్తు చేపట్టింది. ఇప్పటివరకు 18 మందిని అరెస్ట్‌ చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇఒయు నుండి ఈ కేసుకి సంబంధించిన ఆధారాలను సిబిఐ సేకరించనుందని వారు పేర్కొన్నారు.

➡️