బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలి

Feb 26,2024 23:29
ఎన్నికల

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌
ఎన్నికల విధులకు సంబంధించి నోడల్‌ అధికారులకు ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీడియోకాన్ఫరెన్స్‌ హాల్లో నోడల్‌ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ మాధవీలత మాట్లాడుతూ, 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణ పూర్తి అయ్యే వరకు ప్రతి ఒక్క నోడల్‌ అధికారి వారికీ కేటాయించినా బాధ్యతలను సమర్థ వంతంగా పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో 16 నోడల్‌ టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ సంబంధిత నోడల్‌ అధికారుల ప్రణాళికపై సమీక్ష నిర్వహిస్తారన్నారు. అందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. స్వీప్‌ కార్యకలాపాలపై ఇటీవల జరిగిన ఎన్నికల కమిషన్‌ సమావేశంలో జిల్లాకి చెందిన నోడల్‌ టీమ్‌ చక్కటి ప్రజెంటేషన్‌ ఇచ్చిందన్నారు. మిగిలిన నోడల్‌ అధికారులూ అందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రతి నోడల్‌ అధికారీ వారి అనుబంధ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. నోడల్‌ అధికారుల విధులు, బాధ్యతలు, సూచనలు, ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను జెసి ఎన్‌.తేజ్‌భరత్‌ వివరించారు. విధి నిర్వహణలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అత్రిక్రమిస్తే తీవ్రంగా పరిగణిస్తామన్నారు. ఎన్నికల సంబంధిత అధికారుల సామర్థ్యాన్ని పెంపొందించడం, శిక్షణ ఇవ్వడం, శిక్షణా వేదిక ఏర్పాట్లు, అన్ని లాజిస్టిక్‌లు, శిక్షణ సామగ్రి, వాటి పంపిణీ వంటి వాటికి నోడల్‌ అధికారులే బాధ్యత వహించాలన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో సహాయ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌, డిఆర్‌ఒ జి.నరసింహులు, కెఆర్‌ఆర్‌సిఎస్‌డిటి ఆర్‌.కృష్ణ నాయక్‌, ఇతరా అధికారులు పాల్గొన్నారు.

➡️