ముగ్గురు విద్యార్థులకు అస్వస్థత

Feb 22,2024 22:11
ముగ్గురు విద్యార్థులకు అస్వస్థత

ప్రజాశక్తి-గోపాలపురంమండలంలోని గంగోలు పరిధిలో యర్రవరంలో ఎంపిపి పాఠశాలకు వెళ్లి వచ్చిన ముగ్గురు విద్యార్థులు అస్వస్థత గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పాఠశాలలో ఒకటో తరగతి నుండి 5వ తరగతి వరకు సుమారు 36 మంది విద్యను అభ్యసిస్తున్నారు. ఐదో తరగతి విద్యార్థి గౌతమ్‌, మూడో తరగతి విద్యార్థి అవినాష్‌, నాలుగో తరగతి విద్యార్థి సిద్ధూ బుధవారం పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేశారు. సాయంత్రం ఇంటికి వెళ్లారు. రాత్రి సమయంలో వారికి వాంతులు, విరోచనాలు కావడంతో స్థానిక పిహెచ్‌సికి తీసుకెళ్లారు. వైద్యులు చికిత్స అందించిన తర్వాత ఒకరిని తాళ్లపూడి ప్రైవేట్‌ ఆసుపత్రికి, ఇద్దరిని గోపాలపురం సిహెచ్‌సికి తరలించారు. ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించిన విద్యార్థి సిద్ధూకు పరీక్షలు నిర్వహించగా టైఫాయిడ్‌ అని వైద్యులు ధ్రువీకరించారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎంఇఒలు జి.శ్రీనివాసరావు, ఎ.మహేశ్వర రావు పరామర్శించారు. వారి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఎంఇలతో విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడారు. పాఠశాలలో వంటలు సక్రమంగా లేవని, పరిశుభ్రత లేదని చెప్పారు. దీనిపై ఎంఇఒలు శ్రీనివాసరావు, మహేశ్వరరావు మాట్లాడుతూ దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి, వైద్య పరీక్షల రిపోర్టు అందగానే పేరెంట్స్‌ కమిటీ మీటింగ్‌ ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాఠశాల హెచ్‌ఎం డి.జాన్‌ మాట్లాడుతూ బుధవారం మెనూలో భాగంగా వెజిటబుల్‌ రైస్‌, బంగాళదుంప, వంకాయ కూర తయారు చేశారని అన్నారు. వంటలను ఉపాధ్యాయులు టెస్ట్‌ చేశారని తెలిపారు. పాఠశాలలో మిగిలిన విద్యార్థులు ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన తెలిపారు. గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ హేమ కుమార్‌ మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు.

➡️