శిథిలావస్థలో సర్కారు బడి

Feb 6,2024 23:28
పాఠశాల

పెచ్చులూడుతున్న శ్లాబు
భయాందోళనలో గోపవరం ఎంపిపి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు
ప్రజాశక్తి – గోపాలపురం
విద్యతోనే దేశాభివద్ధి సాధ్యం, ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందిస్తాం, నాడు-నేడుతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం… అంటూ ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి నాయకుడు, అధికారుల వరకూ ప్రతిరోజూ ఇస్తున్న ప్రకటనలు ఇవి. ప్రజాప్రతినిధులు, అధికారుల ఊకదంపుడు ఉపన్యాసాలకు క్షేత్రస్థాయిలో పరిస్థితికి పొంతనే ఉండట్లేదు. కనీస వసతులు లేక, ఎప్పుడు కూలుతాయే తెలియని భవనాల్లో ప్రాణలను అరిచేతిలో పట్టుకుని విద్యనభ్యసిస్తున్నారు గోపవరం మండల ప్రజాపరిషత్‌ విద్యార్థులు.మండలంలోని గోపవరం మండల ప్రజా పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు 120 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఎనిమిది తరగతుల నిర్వహణకు ఎనిమిది తరగతి గదులు కావాల్సి ఉంది.అదనంగా ఉపాధ్యాయులకు స్టాఫ్‌ రూమ్‌తో పాటు ల్యాబ్‌కు మరొక గది మొత్తం ఇక్కడ 10 గదులు అవసరం. కాని ప్రస్తుతం ఈ పాఠశాలలో ఐదు తరగతి గదులు మాత్రమే ఉన్నాయి. అందులోనూ రెండు తరగతి గదుల భవనాలను నిర్మించి 27 ఏళ్లు పైబడ్డాయి. దీంతో ప్రస్తుతం అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇప్పటికే శ్లాబ్‌ పెచ్చులూడి కింద పడుతోంది. శ్లాబ్‌కు ఉపయోగించిన ఇనుప ఊచలు పూర్తిగా తుప్పుబట్టి బలహీనంగా మారాయి. దీంతో శ్లాబు ఎప్పుడు పడిపోతుందోనని ఉపాధ్యాయులు, విద్యార్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నగదులు చాలకపోవడంతో వరండాలోనే విద్యార్థులను కూర్చోబెట్టి తరగతులను నిర్వహిస్తున్నారు. వర్షాకాలం వస్తే తరగతుల నిర్వహణ మరింత కష్టంగా ఉంటోంది. శ్లాబ్‌ నుంచి నీరుకారడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వరండాలో వర్షపు జల్లు రావడంతో అక్కడ కూడా క్లాసులను నిర్వహించడం కష్టంగా మారుతోంది. ఇన్ని సమస్యలున్నప్పటికీ నాడు-నేడు మొదటి, రెండో విడతల్లోనూ ఈ పాఠశాలకు చోటు దక్కలేదు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శిథిలమైన గదులపై తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్ల కొరతభవనాలతో పాటు మరుగుదొడ్ల కొరత విద్యార్థులను వేధిస్తోంది. తగినన్ని టాయిలెట్స్‌ లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని వారు తెలిపారు. మూడు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయని, వీటినే ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థినిలు సైతం ఉపయోగించుకోవాల్సి వస్తుందని తెలిపారు. మరుగుదొడ్ల నిర్వహణ, రన్నింగ్‌ వాటర్‌ కూడా సరిగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినులు చెబుతున్నారు. తాగునీటి సమస్యవిద్యార్థులకు పాఠశాలలో మంచినీటి వసతి కూడా లేదు. ఆర్‌ఒ ప్లాంటు కాదుగదా కనీసం బోరు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి బాటిళ్లలో తాగునీటిని తెచ్చుకుంటున్నా సాయంత్రం వరకూ అవి సరిపోక దాహంతో అలమటిస్తున్నారు. ఇంటి నుంచి తెచ్చుకోని వారు సాయంత్రం వరకూ దాహార్తితోనే అలమటిస్తున్నారు. స్కూల్‌ ఆయా బయట నుంచి తెచ్చిన నీటితోనే దాహార్తిని తీర్చుకుంటున్నామని విద్యార్థులు తెలిపారు.పాఠశాలలో మౌలిక వసతుల కొరత:పాఠశాలలో ఫ్లోరింగ్‌ గుంతమయంగా మారింది. పాఠశాల ఆవరణ సైతం ఇదే పరిస్థితి. గుంతల్లో విద్యార్థులు పడి గాయపడుతున్నారు. కనీసం ఆటలాడుకునేందుకు స్థలం లేదని, ఆట సామగ్రి కూడా లేదని విద్యార్థులు చెబుతున్నారు. పాఠశాల గదుల్లో తగినన్ని లైట్లు, ఫ్యాన్లు కూడా లేకపోవడంతో అవస్థలు పడుతున్నామని వారు తెలిపారు.ఉపాధ్యాయుల కొరతపాఠశాలలో 120 మంది విద్యార్థులకు, ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులకు విద్యాబోధన చేసేందుకు ఐదుగురు మాత్రమే ఉపాధ్యాయులు ఉన్నారు. ఇప్పటికీ పాఠశాలలో తెలుగు, హిందీ టీచర్స్‌ లేరు. దీంతో ఈ సిలబస్‌ సరిగా ముందుకు సాగట్లేదు. మిగిలిని టీచర్లే వీటినీ బోధిస్తున్నారు. ఫలితంగా ఉపాధ్యాయులపై అదనపు భారం పడుతుంది. విద్యార్థులపై సరైన పర్యవేక్షణ చేయలేపోతున్నారు. దీంతో సర్పంచ్‌ యండపల్లి శేఖర్‌బాబు విద్యార్థుల భవిష్యత్తు దష్టిలో ఉంచుకొని విద్యావాలంటీర్లను ఏర్పాటు చేశారు. ఠాగూర్‌ లేబొరేటరీస్‌ ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి నెలకు రూ.5వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తూ ఆరుగురు వాలంటీర్లను నియమించారు. 2022 నుంచి వారితోనే నెట్టుకొస్తున్నారు. అసంపూర్తిగా వంటశాలవంటశాల నిర్మాణం చేపట్టి నాలుగు సంవత్సరాలు అయ్యింది. నేటికీ పనులు పూర్తి కాలేదు. అసంపూర్తిగా వదిలేశారు. పాడుబడిన వంటశాలలోనే కార్మికులు విద్యార్థులకు భోజనం తయారు చేస్తున్నారు. వంటశాల పూర్తికాకపోవడంతో వంటకు నానా కష్టాలు పడుతున్నామని, వర్షం వచ్చిన సమయంలో మరింత ఇబ్బందులుపడుతున్నామని మిడ్డేమీల్స్‌ కార్మికులు తెలిపారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టికి తీసుకెళ్లాం…
పాఠశాల సమస్యలను పలుమార్లు ఎంఎల్‌ఎ, అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ‘నాడు-నేడు’ నిధులు కేటాయించాలని కోరాని స్పందించలేదు. గ్రామానికి ఈ పాఠశాల తప్ప మరో దిక్కులేదు. ఇంకో పాఠశాలకు వెళ్లాలంటే ఏడు కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అధికారులు స్పందించాలి. మౌలిక వసతులు కూడా లేకపోవడంతో విద్యార్థుల సంఖ్యకూడా తగ్గుతోంది. శిథిల భవనాలను తొలగించి నూతన భవనాలు నిర్మించాలి.
– యండపల్లి శేఖర్‌బాబు, సర్పంచ్‌
సమస్య మా దృష్టికి వచ్చింది…
గోపవరం మండల పరిషత్‌ పాఠశాల సమస్యలు మా దృష్టికి వచ్చాయి. పాఠశాలలో రెండు భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. విద్యార్థులకు నాలుగు గదుల అవసరం ఉంది. మొదటి, రెండవ దశ నాడు-నేడులో ఈ పాఠశాలకు నిధులు విడుదల కాలేదు. మూడో లిస్టులో విడుదలయ్యే అవకాశం ఉంది.
– జి.శ్రీనివాసారావు, ఎంఇఒ

➡️