ప్రతి రౌండ్‌లో 14 టేబుల్స్‌ ఓట్ల లెక్కింపు

May 23,2024 23:18
ప్రతి రౌండ్‌లో 14 టేబుల్స్‌ ఓట్ల లెక్కింపు

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌జిల్లాలో రాజమండ్రి పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్‌ 4న నన్నయ యూనివర్సిటీలో నిర్వర్తించడం కోసం తగిన మానవ వనరులు, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా వెలగపూడి నుంచి జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాలో చేపట్టనున్న ప్రణాళికలను కలెక్టర్‌ మాధవీలత వివరించారు. జూన్‌ 13న జిల్లావ్యాప్తంగా 1,577 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించినట్టు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 16,23,149 మంది ఓటర్లలో 13,13,630 మంది (80.93 శాతం) మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు. జూన్‌ 4న ఓటింగ్‌ లెక్కింపు ప్రక్రియ కోసం ప్రతి రౌండ్‌లో అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా విడివిడిగా 14 చొప్పున టేబుల్స్‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ నలుగురు ఎన్నికల పరిశీలకులను రాష్ట్రానికి కేటాయింంచినట్టు తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపును కౌంటింగ్‌ కేంద్రాలలో చేపడతామని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.తేజ్‌ భరత్‌, డిఆర్‌ఒ జి.నరసింహులు పాల్గొన్నారు.

➡️