విద్యా ప్రదాత అల్లూరి మూర్తిరాజు

Apr 9,2024 21:02

ప్రజాశక్తి – నెల్లిమర్ల : మిమ్స్‌ వైద్య కళాశాల వ్యవస్థాపకులు స్వర్గీయ అల్లూరి మూర్తిరాజు విద్యా ప్రదాత అని ఆయన కుమా రుడు, మిమ్స్‌ మెడికల్‌ కళాశాల చైర్మన్‌ అల్లూరి సత్యనారా యణరాజు (బాబీ) అన్నారు. స్వర్గీయ మూర్తిరాజు జయంతి వేడుకలను మిమ్స్‌ క్యాంపస్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. చైర్మన్‌ సత్యనారాయణరాజుతో పాటు మిమ్స్‌ యాజమాన్య ప్రతనిధులు, పలువురు ఉద్యోగులు తొలుత మూర్తి రాజు సమాధిని దర్శించుకుని పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. క్యాంపస్‌లోని మూర్తిరాజు విగ్రహం వద్ద ఆయన చిత్ర పటం ఉంచి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మిమ్స్‌ చైర్మన్‌ సత్యనారాయ ణరాజు మాట్లాడుతూ నెల్లిమర్లలోని మిమ్స్‌ వైద్య కళాశాలతో పాటు రాష్ట్ర రాష్టేతర ప్రాంతాలో ఎన్నో విద్యా సంస్థలను ఏర్పాటు చేసి విద్యా సేవ చేసిన ఘనత మూర్తిరాజుకే దక్కుతుందన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే తొలి ప్రైవేటు వైద్య కళాశాల మిమ్స్‌ను ఏర్పాటు చేసి ఈ ప్రాంత విద్యార్థులకు వైద్య విద్య అందించారని కొనియాడారు. వైద్య కళాశాల ఏర్పాటు కారణంగా ఇటు విద్యార్థులకు వైద్య విద్య అందించడంతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌, ఒడిషా రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది రోగులు వైద్య, సేవలు పొందుతున్నారని అన్నారు. ఎంతో మంది స్థానికులకు కూడా ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. ఆయన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయన్నారు. ఆయన స్థాపించిన మిమ్స్‌ను అన్ని రంగాలుగా బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సత్యనారాయ ణరాజు సూచించారు. ఆయన ఆశయాల సాధనకు సమిష్టి కృషితో ముందుకు వెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మూర్తి రాజు మేనల్లుడు జివిఎస్‌ఎన్‌ వర్మ, మిమ్స్‌ వైద్య కళాశాల ప్రతినిధులు, ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.

➡️