ఊపందుకున్న ఎన్నికల ప్రచారం..

Apr 6,2024 21:21

ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా టిడిపి,జనసేన, బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థులు, వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థులు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని కూటమి అభ్యర్థులు చెప్పగా, ఇప్పటికే తాము చేసిన అభివృద్ధిని చూసి మరోసారి తమకు ఓటు వేయాలని వైసిపి అభ్యర్థులు ప్రజలను కోరుతున్నారు. కాగా జిల్లాలో ఎస్‌కోట నియోజకవర్గంలోనే స్వతంత్ర అభ్యర్థిగా గొంప కృష్ణ బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన సతీమణితో కలిసి గ్రామాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు.ఉదయం సాయంత్రం నాయకుల ప్రచారాలతో గ్రామాలు సందడిగా కనిపిస్తున్నాయి..కడుబండి ఇంటింట ప్రచారం

ప్రజాశక్తి- కొత్తవలస : రాష్ట్రంలో అభివృద్ధి చూసి ఓటు వేయాలని, టిడిపి మిత్రపక్షాల కల్లబొల్లి మాటలు విని మోసపోవద్దని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. శనివారం రాత్రి ఉత్తరాపల్లి, చిన్నిపాలెం గ్రామ పంచాయతీలలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక టిడిపి మిత్రపక్షాలు లేనిపోని అవాకులు, చవాకులు అల్లుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేని చంద్రబాబు నాయుడు విషం చిమ్ముతున్నారని విమర్శించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పనితీరును వివరిస్తూ తనను మరోసారి గెలిపించాలని కడుబండి కోరారు. అభివృద్ధిని చూపిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నామని, లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షం ఓట్లు అడిగేందుకు సిద్ధమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కొప్పల వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ నెక్కలనాయుడు బాబు, ఎంపిపి నీలంశెట్టి గోపమ్మ, జెడ్‌పిటిసి నెక్కల శ్రీదేవి, వైసిపి మండల అధ్యక్షుడు ఒబ్బిన నాయుడు, ఉత్తరాపల్లి, చిన్నిపాలెం సర్పంచులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. కోళ్ల ఎన్నికల ప్రచారంకొత్తవలస: రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే టిడిపి అధికారంలోకి రావాలని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి అన్నారు. మండలంలో శనివారం సాంబయ్యపాలెం, కొత్తూరు, అంబేద్కర్‌ కాలనీ, కొత్త సుంకరపాలెం, కంటకాపల్లి గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె మాట్లాడూతూ వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు ఊపిలో పెట్టి అభివృద్ధిని మరిచిపోయిందని అభివృద్ధి జరగాలంటే తప్పకుండా టిడిపికి ఓటేయాలని కోరారు. టిడిపి హయాంలో పంచాయతీ బిల్డింగ్స్‌, సిసి రోడ్లు, తారు రోడ్స్‌, తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌, చంద్రన్న భీమా, పసుపు కుంకుమ, అన్న క్యాంటిన్‌, పెళ్లికానుక, ఆదరణ పథకం, బీసీలకి సబ్సిడీ లోన్స్‌, కళ్ళుగీత డప్పు కళాకారులకు పెన్షన్స్‌ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు చేశామని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా తనకు, ఎంపిగా భరత్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలదే రేగిడి: రాష్ట్రంలో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రజలపై ఉందని, అందుకు ప్రతి ఓటరు గుర్తించుకుని విజ్ఞతతో రానున్న ఎన్నికల్లో వైకాపాను బంగాళాఖాతంలో కలపాలని మాజీ మంత్రి, టిడిపి నియోజకవర్గం ఇన్చార్జి కోండ్రు మురళి కోరారు. ఈ మేరకు శనివారం మండలంలోని తాటిపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు రూపకల్పన చేసిన సూపర్‌ సిక్స్‌ పథకాలు, బీసీ డిక్లరేషన్‌ పై ప్రజలకు వివరిస్తూ ప్రజలను ఆశీర్వాదించాలని కోరారు. అనంతరం ‘జయహో బీసీ’ కార్యక్రమం నిర్వహించారు. కోండ్రు మాట్లాడుతూ యువత భవిష్యత్తు పై జగన్‌ దెబ్బకొట్టాడన్నారు. యువత ఎప్పుడూ పేదరికంలోనే ఉండాలని జగన్‌ కోరుకుంటున్నారని చెప్పారు. యువత భవిత మన బాబు బాధ్యత, యువత అంతా కలిసి చంద్రబాబు నాయుడుతో కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలుు పాల్గొన్నారు.సమస్యలపై పని చేసేందుకు గెలిపించండిబొబ్బిలి: ప్రజా సమస్యలపై పని చేసేందుకు ఓట్లు వేసి తనను గెలిపించాలని టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన కోరారు. మున్సిపాలిటీలోని ఐటిఐ కాలనీలో శనివారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థిం చారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇంచార్జి గిరడ అప్పలస్వామి, బాబు పాలూరి, టిడిపి, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. టిడిపిలో పలువురు చేరికరామభద్రపురం మండలంలోని నాయుడువలస పంచాయతీకి సంబంధించి నాయుడువలస, కొండపాలవలస గ్రామాల నుండి సుమారు 60 కుటుంబాలు శనివారం టిడిపిలో చేరాయి. కొండపాలవలస గ్రామం ప్రస్తుత వైసిపి ఉపసర్పంచ్‌ లెంక శ్రీనివాసరావు, వార్డు మెంబరు దువ్వు అప్పలస్వామి ఆధ్వర్యంలో బొబ్బిలి కోటకు వచ్చి టిడిపి నియోజకవర్గ ఇంచార్జి బేబినాయన సమక్షంలో టిడిపిలో చేరారు. ఈ కార్యక్రమంలో టిడిపి విజయనగరం పార్లమెంటు జిల్లా ఉపాధ్యక్షులు మడక తిరుపతినాయుడు, విజయనగరం పార్లమెంటు బీసీ సెల్‌ ఉపాధ్యక్షులు కర్రోతు తిరుపతి రావు పాల్గొన్నారు.గొంప గెలుపు ఖాయం:గొంపవేపాడ: స్వతంత్య్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతున్న తాను 20వేల ఓట్లు మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని టిడిపి రెబల్‌ అభ్యర్థి గొంప కృష్ణ అన్నారు. మండలంలోని ఆయన స్వగ్రామంలో శనివారం మండల నాయకులు గొంప వెంకటరావు ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం చేపట్టారు. యువనేత గొంప కృష్ణ తన సతీమణి రమాదేవితో కలిసి శుక్రవారం రాత్రి నల్లబెల్లి, బోజింకివానిపాలెం, చిన్నగుడిపాల గ్రామాలలో ప్రచారం చేయగా శనివారం కుమ్మపల్లి, ఏ.కే.జీ పాలెం గ్రామాలలో ప్రచారం ముమ్మరంగా చేపట్టారు. ఈ సందర్భంగా గొంప కృష్ణ మాట్లాడుతూ తొలిసారి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న తనను ప్రతి ఒక్కరూ ఆశీర్వాదించాలన్నారు. ఈ కార్యక్రమంలో వేపాడ, కొత్తవలస, జామి మండల నాయకులు లగుడు రవికుమార్‌, గొరపల్లి రాము, గుమ్మడి భారతి, పైడిబాబు, కార్యకర్తలు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు.

➡️