పేదల భవితను నిర్ధేశించే ఎన్నికలు

May 3,2024 22:47

సభలో మాట్లాడుతున్న సిఎం జగన్‌
ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి/ క్రోసూరు :
గత ఐదేళ్లుగా వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వచ్చే ఎన్నికల్లో టిడిపి ఓడించాలని సిఎం జగన్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. క్రోసూరు సభ మధ్యాహ్నం 1 గంటకు జరిగింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జగన్‌ మాట్లాడుతూ పేదల కోసం ఎన్నో పథకాలు అమలు చేసి పరిపాలన వ్యవస్థను ప్రజల ముగింటకు తెచ్చామని చంద్రబాబు గెలిస్తే ఈ పథకాలన్నీ రద్దు చేయడంతోపాటు వాలంటీర్ల వ్యవస్థను తొలగిస్తారని అన్నారు. ఇవి జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కాదని, పేదలకు, చంద్రబాబు చేసే మోసాలకు మధ్య జరుగుతున్న యుద్ధమని చెప్పారు. ఈ ఎన్నికలు పేదవాడి భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నారు. వైసిపికి ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు, పొరపాటున చంద్రబాబుకి ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు అని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఎన్నో హామీలను విస్మరించి మోసం చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. 2014లో రైతుల రుణాలను మాఫీచేస్తానని తొలి సంతకం చేసి దాన్ని నెరవేర్చకుండా మోసం చేయలేదా? అని ప్రశ్నించారు. పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామని మహిళలను అన్యాయం చేశారన్నారు. పేదలకు మూడు సెంట్లు స్థలం, పక్కా గృహ నిర్మాణం చేస్తామని, అన్ని నగరాల్లో హైటెక్‌ సిటీలు నిర్మిస్తామని చెప్పారని, పెదకూరపాడులో ఐటి సెక్టార్‌ వచ్చిందా? అని ప్రశ్నించారు. 2014లో మాదిరిగానే మళ్లీ 2024లో టిడిపి, బిజెపి, జనసేన ముగ్గురూ జతకట్టి ప్రజలను మోసం చేయడానికి ముందుకొస్తున్నారని, ప్రజలకు మంచి జరగాలంటే బిజెపి, టిడిపి, జనసేన కూటమిని ఓడించా లని, వైసిపిని గెలిపించాలని కోరారు. చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలు దోచుకున్నా యని విమర్శిం చారు. చంద్రబాబు ఏళ్ల పరిపాలనలో చెప్పుకోదగ్గ పథకం ఒక్కటైనా ఉందా? అని అన్నారు. అమలుకు వీలుకాని హామీలతో చంద్రబాబు ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పి.అనిల్‌కుమార్‌, పెదకూరపాడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నంబూరు శంకరరావులను గెలిపించాలని కోరారు. ఇదిలా ఉండగా సిఎంను గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్య, సత్తెనపల్లి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థులు అంబటి రాంబాబు, నూరిఫాతిమా తదితరులు కలిశారు. జనసేన గుంటూరు నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్‌ సిఎం జగన్‌ సమక్షంలో వైసిపిలో చేరారు.

➡️