హింస, రీపోలింగ్‌కు తావులేకుండా ఎన్నికలు

Apr 18,2024 00:06

మాట్లాడుతున్న పల్నాడు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శివశంకర్‌
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
పల్నాడు జిల్లాలో తొలిసారిగా నిర్వహిస్తున్న సార్వత్రిక ఎన్నికలు హింసాత్మక ఘటనలు, రీపోలింగ్‌కు అవకాశమేమీ లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు ఉద్యోగులు, సిబ్బంది కృషి చేయాలని పల్నాడు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ కోరారు. 0 శాతం హింస, 0 శాతం రీపోలింగ్‌కు సహకరించాలన్నారు. ఎన్నికల సన్నద్ధతపై ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు, మండల, సెక్టార్‌ అధికారులు, పోలీసు సిబ్బందితో పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో బుధవారం సమీక్షించారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పోలింగ్‌ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అందరూ నిబద్ధతతో విధులు నిర్వహించాలన్నారు. సి విజిల్‌ యాప్‌ అమలులో పల్నాడు జిల్లా ముందు వరుసలో ఉందన్నారు. ఎలక్షన్‌ సీజన్‌ మేనేజ్మెంట్‌ సిస్టంలో తనిఖీల ముమ్మరం చేయాలని, ఎక్కడా అలసత్వం ప్రదర్శించొద్దని చెప్పారు. జిల్లాలో మొత్తం 557 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలున్నాయని తెలిపారు. పోలింగ్‌ రోజున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ప్రత్యేక నిఘాని పెట్టాలన్నారు. ఎన్నికల సంఘం ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సిసి, రిటైర్డ్‌ పోలీస్‌ అధికారులను బందోబస్తు, క్యూలైన్‌ మేనేజ్మెంట్‌ విధులు నిర్వహించుకోవచ్చని తెలిపిందన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో ఓటింగ్‌ మే 5,6,7 తేదీలలో నిర్వహించడం జరుగుతుందని, హోం వోటింగ్‌కు సంబంధించి మే 8,9 తేదీల్లో ఉంటుందని తెలిపారు. 85 ఏళ్లు పైబడిన వారు ముందస్తుగానే పిడబ్ల్యూడిగా నమోదు చేసుకున్న వారికి మాత్రమే హోం ఓటింగ్‌ ప్రక్రియ ఉంటుందని, వారికి 12 -డి ఫారాలు అందించామని తెలిపారు. హోం మ్‌ ఓటింగ్‌ ప్రక్రియ పై సిబ్బంది అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలింగ్‌ రోజున పోలింగ్‌ సిబ్బంది పోలీస్‌ సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు. పోలింగ్‌ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందని చెప్పారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి ఐడి కార్డు కలిగి ఉండాలన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రంగా జేఎన్టీయూ కాలేజీని ఎంపిక చేశామని చెప్పారు. జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్‌ మాట్లాడుతూ వివిధ రాజకీయ పార్టీలకు ఒకేసారి ఒకే రోజున, ఒకే సమయంలో ఊరేగింపులకు అవకాశం ఇవ్వవద్దని, వీలైనంతవరకు ర్యాలీలను పక్క రోజుకి మార్చుకునేలా చూడాలని చెప్పారు. నామినేషన్‌ రోజున అవసరమైన మేరకే అభ్యర్థితో పాటు వేరే వారిని లోపలికి పంపించాలన్నారు. పోలింగ్‌ రోజున 144 సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు. సమస్యలుంటే పై అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాద్‌, జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం, అడిషనల్‌ ఎస్పీ రాఘవేంద్ర, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️