ఎన్నికల గ్యాస్‌..!

వంటగ్యాస్‌ ధర రూ.వంద తగ్గిస్తూ ప్రకటన
రూ.410 ఉన్న సిలిండర్‌ ధర రూ.1130కు పెంచిన మోడీ సర్కార్‌
ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో రూ.200 తగ్గింపు
సాధారణ ఎన్నికల ముందు మరోసారి రూ.వంద తగ్గింపు
ఇప్పటికీ 14.2 కిలోల సిలిండర్‌ ధర రూ.800పైనే
మిగిలిన భారం సంగతిమేటంటున్న మహిళలు
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి
వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింపు ఎన్నికల స్టంట్‌గా మారిపోయింది. ఎన్నికల సమయంలో సిలిండర్‌ ధర తగ్గించినట్లు ప్రకటించి సామాన్య ప్రజానీకాన్ని ఏమార్చేందుకు మోడీ సర్కార్‌ కొత్త జిమ్మిక్కులకు దిగింది. 2014 ఎన్నికల అనంతరం మోడీ సర్కార్‌ అధికారం చేపట్టే నాటికి వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర ఎంత ఉంది. తర్వాత ఏస్థాయికి పెంచారు. తర్వాత ఎంత తగ్గించారో తెలుసుకుంటే మోడీ సర్కార్‌ జనాన్ని ఏవిధంగా మోసగిస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 2014లో మోడీ అధికారంలోకి వచ్చేసరికి 14.2 కిలోల వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.410గా ఉంది. వంటగ్యాస్‌ ధరను భారీగా పెంచుతూ మోడీ సర్కార్‌ రూ.1130కు తీసుకెళ్లింది. అంతేకాకుండా ప్రభుత్వం ఇచ్చే గ్యాస్‌ సబ్సిడీని సైతం నిలిపివేసింది. కొంతమందికి సబ్సిడీ సొమ్ము రూ.15 నుంచి రూ.20లోపే జమవుతుండటం గమనార్హం. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఎనిమిది లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. వంటగ్యాస్‌ ధర భారీగా పెరగడంతో సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రతినెలా ఆదాయంలో రూ.వెయ్యికిపైగా గ్యాస్‌ సిలిండర్‌కు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇక పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరగడంతో సామాన్య ప్రజానీకం బతుకు కష్టతరంగా మారింది. జనాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో మోడీ సర్కార్‌ ఎన్నికల ముందు సర్దుబాటుకు దిగింది. 2023లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ఆగస్టు 29న గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.200 తగ్గించినట్లు ప్రకటించింది. దీంతో సిలిండర్‌ ధర రూ.910కి తగ్గింది. పెంచిందెంత.. తగ్గించిందెంత అనే విమర్శలు సైతం వెల్లువెత్తాయి. సాధారణ ఎన్నికల నోటిఫికేషన్‌ మరో నాలుగైదు రోజుల్లో రానుండటంతో సిలిండర్‌ ధరను మరో రూ.వంద తగ్గిస్తున్నట్లు మోడీ సర్కార్‌ ప్రకటించింది. దీన్ని మహిళా దినోత్సవ కానుకంగా మోడీ ప్రకటించడం మరింత విడ్డూరంగా ఉంది. సిలిండర్‌ ధర రూ.1100కుపైగా పెంచినప్పుడు గుర్తుకు రాని మహిళలు, తగ్గించినప్పుడు గుర్తుకు రావడం ఏమిటో తెలియడం లేదు. ఇప్పటికీ గ్యాస్‌ సిలిండర్‌ రూ.810 వరకూ పలుకుతోంది. అంటే భారీగా పెంచి కొద్దిగా తగ్గించి జనాన్ని ఉద్దరించినట్లు మోడీసర్కార్‌ చేస్తున్న ప్రచారం చూసి అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అమాయకులని, తాము ఏం చెబితే అది నమ్ముతారనే భావనలో మోడీ పరివారం ఉన్నట్లు కన్పిస్తోంది. గ్యాస్‌ ధరతోపాటు పెట్రోల్‌, డీజిల్‌, పప్పుల ధరల పెరుగుదల సామాన్య ప్రజానీకాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని మోడీ సర్కార్‌ మరిచిపోయినట్లు భావిస్తోంది. వంటగ్యాస్‌ ధర తగ్గుదల అంతా ఎన్నికల గ్యాస్‌ అంటూ జనాల్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఎన్నికలు పూర్తయిన తర్వాత మళ్లీ వంటగ్యాస్‌ ధరను పెంచే అవకాశం ఉందని జనం భావిస్తున్నారు.

➡️