కష్టపడి చదివి లక్ష్యాలను సాధించాలి

సినీ నటులు సుమన్‌

ప్రజాశక్తి – భీమడోలు

విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రత కలిగి ఉండాలని, కష్టపడి కాక ఇష్టపడి చదవడం ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చునని ప్రముఖ సినీ నటులు సుమన్‌ అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన భీమడోలు మండలం గుండుగొలను గ్రామంలో పర్యటించారు. దీనిలో భాగంగా శ్రీవిద్యాలయ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, కరాటే ప్రదర్శన అంశాలను తిలకించారు. స్థానికంగా వికలాంగులకు విశేష సేవలను అందిస్తున్న శ్రీవిఘ్నేశ్వర వికలాంగుల సేవా సమితికి శ్రీవిద్యాలయ పాఠశాలకు చెందిన విద్యార్థులు మూడు లక్షల రూపాయల విరాళాన్ని అందించడం అభినందనీయమన్నారు. ఆ తర్వాత శ్రీవిఘ్నేశ్వర వికలాంగుల సేవా సమితి చేపడుతున్న నెలవారీ సేవా కార్యక్రమాల్లో భాగంగా 60 మంది వికలాంగులకు నెలవారీ రేషన్‌గా సన్న బియ్యం, పండ్లు, ఇతరాలు అందించే కార్యక్రమంలో సినీ నటుల సుమన్‌ పాల్గొన్నారు. ఈనెల రేషన్‌ సమకూర్చిన ఏలూరుకు చెందిన నెరోలాక్‌ పెయింట్స్‌ సంస్థ సేవలను కొనియాడారు. అనంతరం గ్రామస్తులు సినీ రంగానికి విశేష సేవలను అందించిన సుమన్‌కు పౌర సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు దాట్ల సీతారామరాజు, శ్యామల రాజు, సినీ డైరెక్టర్‌ తోట రవి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

➡️