కెరియర్‌ గైడెన్స్‌ను సద్వినియోగపరుచుకోవాలి

మానవత సంస్థ జిల్లా డైరెక్టర్‌ వెంకట ఉమామహేశ్వరరావు

ప్రజాశక్తి – భీమడోలు

స్వచ్ఛంద సంస్థ మానవత ఆధ్వర్యాన పదవ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న కెరియర్‌ గైడెన్స్‌ తరగతులను సద్వినియోగపరుచుకోవాలని సంస్థ జిల్లా డైరెక్టర్‌ తుమ్మల వెంకట ఉమామహేశ్వరరావు కోరారు. ఆయన ఆధ్వర్యాన మండలంలోని మల్కీ మహమ్మద్‌ పురం, కురెళ్లగూడెం హైస్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు కెరియర్‌ గైడెన్స్‌ తరగతులను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పదవ తరగతి విద్యార్థి దశలో కీలకమని, ఉజ్వలమైన భవిష్యత్తు ప్రణాళిక తయారీకి మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు. అనంతరం సదరు పాఠశాలల్లో తెలుగు మాధ్యమంతో విద్యాపరంగా ప్రతిభ కనపరుస్తున్న ఇద్దరు విద్యార్థులకు సంస్థ తరఫున ప్రథమ బహుమతిగా వెయ్యి రూపాయలు, ద్వితీయ బహుమతిగా రూ.500 నగదు అందజేశారు. దీంతో పాటు విద్యార్థులకు పదవ తరగతి స్టడీ మెటీరియల్‌, మానవత సంస్థ జారీచేసే సర్టిఫికెట్‌, మెమెంటోలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మానవత భీమడోలు శాఖ ఛైర్మన్‌ గుళ్ల నూకరాజు, మాజీ అధ్యక్షులు పచ్చా వెంకటేశ్వరరావు, సదరు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️