క్షేత్రస్థాయి పాలన పట్టాలెక్కేదెప్పుడో..!

బదిలీల కోసం మండలస్థాయి అధికారుల ఎదురుచూపు
ప్రజా సమస్యలపై నేతల సిఫార్సు మేరకే స్పందన
ప్రజాశక్తి – డెస్క్‌
సార్వత్రిక ఎన్నికల పర్వం ముగిసింది. కేంద్రంలోను, రాష్ట్రంలోను కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. రెండు జిల్లాలకు కొత్త కలెక్టర్లు నియమితులయ్యారు. అయినా పాలన పట్టాలెక్కేదెప్పుడోనని జనం ఎదురుచూడాల్సిన పరిస్థితి దాపురించింది. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో కోడ్‌ అమల్లోకి వచ్చి యంత్రాంగమంతా ఎన్నికల విధుల్లో నిమగమయ్యారు. సాధారణంగా సాగే ప్రజా ఫిర్యాదుల స్వీకరణ సైతం నిలిచిపోయింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యి ఫలితాలు వెలువడిన అనంతరం జూన్‌ ఆరో తేదీన ఎన్నికల కోడ్‌ తొలగించారు. అంటే సుమారు రెండు నెలల 20 రోజులు కోడ్‌ అమలులో ఉండటంతో ప్రజా సమస్యలన్నీ ఎక్కడికక్కడ పేరుకుపోయాయి. కోడ్‌ తొలగి సుమారు 20 రోజులవుతున్నా ఇప్పటికీ పాలనా కార్యక్రమాలు పూర్వ స్థితికి చేరలేదు. గత ప్రభుత్వ విధానాల ఫలితంగా ఏర్పడిన ఇబ్బందుల నుంచి జనం ఉపశమనం కోరుకుంటున్నారు. ప్రధానంగా ధరా భారంతోపాటు చెత్త పన్ను ఇతర భారాల ఉపసంహరణ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వీటిపై ప్రభుత్వం విధానపర నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తేగాని ప్రజానీకానికి ఉప శమనం దక్కే అవకాశం లేదు. ఈ క్రమంలో కొత్తగా ఎన్నికైన ప్ర జాప్రతినిధులు ఇప్పు డిప్పుడే తమ కార్యకలాపాలను ము మ్మరం చేశారు. జనం సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రా ధాన్యతాక్రమంలో వాటిని పరిష్కరిస్తామని, ఆం దోళన చెందొద్దంటూ భరోసా ఇస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. కొత్త ప్రజాప్రతినిధులొచ్చారు.. కొత్త కలెక్టర్లు నియమితులయ్యారుగాని ఎన్నికల బదిలీల్లో భాగంగా ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు వచ్చిన మండలస్థాయి అధికారులు ఇంకా అక్కడే విధుల్లో ఉన్నారు. వీరంతా తమ సొంత జిల్లాలకు ఎప్పుడెళ్తామా అనే మూడ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో తమ సొంత జిల్లాల్లో తమకు అనువైన ప్రాంతాల్లో నియామక ఉత్తర్వులు పొందేందుకు ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు, నేతలను కలిసే పనిలో వీరంతా నిమగమయ్యారు. ఎంఎల్‌ఎలు, జిల్లా అధికారులు తమ ప్రాంతాలకు వచ్చినప్పుడే వీరు ఎక్కువ అందుబాటులో ఉంటున్నారు. కొత్త ఎంఎల్‌ఎలు సైతం తమకు అనుకూలంగా ఉండే అధికారుల కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, నేతలు సిఫార్సు చేసిన వినతులు, అంశాలపైనే అధికారులు స్పందిస్తున్నారు. క్షేత్రస్థాయిలో తాగునీరు, ఇతర అత్యవసర అంశాలపైనా ఉన్నతాధికారులతో సంప్రదించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అంతేగాని రోజువారీ దైనందిన కార్యకలాపాలపై డివిజన్‌, మండలస్థాయి అధికార యంత్రాంగం పెద్దగా దృష్టి సారించడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఏలూరు జిల్లా కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి బుధవారం బాధ్యతలు స్వీకరించబోతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ నాగరాణి కూడా రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. కలెక్టర్లు బాధ్యతలు స్వీకరిస్తే బదిలీల పర్వం ప్రారంభమవుతుందని తెలుస్తోంది. అదే జరిగి కొత్త అధికారుల నియామకం జరిగితే వారం, పది రోజుల్లో క్షేత్రస్థాయి అధికార యంత్రాంగం గాడిన పడే అవకాశం ఉంది. ప్రభుత్వ విధానపర నిర్ణయాలు, పథకాల మాట ఎలాగున్నా తాము రోజువారీ ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలు కొన్నయినా పరిష్కారమవుతాయని జనం ఎదురుచూస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు త్వరిగతిన చర్యలు చేపట్టాలని అంతా కోరుతున్నారు.

➡️