నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

ఏర్పాట్లన్నీ పూర్తి
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌
నేటి నుంచి జరగనున్న ఇంటర్మీడియట్‌ థియరీ పబ్లిక్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు ఏలూరు జిల్లా వృత్తి విద్యా శాఖాధికారి, జిల్లా పరీక్షల కమిటీ కన్వీనర్‌ బి.ప్రభాకర్‌రావు, పశ్చిమగోదావరి జిల్లా పరీక్షల కమిటీ కన్వీనర్‌, ఇంటర్‌ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.చంద్రశేఖర్‌బాబు తెలిపారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 101 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో పశ్చిమగోదావరి జిల్లాలో 50, ఏలూరు జిల్లాలో 51 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో మొదటి సంవత్సరం విద్యార్థులు 17,806 మంది పరీక్షలు రాయనుండగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 18,143 మంది మొత్తం 35,949 మంది పరీక్షలు రాయనున్నారు. అలాగే ఏలూరు జిల్లాలో మొదటి సంవత్సర విద్యార్థులు 15,656 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 16,789 మంది మొత్తం 32,445 మంది పరీక్షలు రాయనున్నారు. మొత్తం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 68,394 మంది పరీక్షలు రాయమన్నారు. ఈ పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. పబ్లిక్‌ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలూ జరగకుండా అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌తో ఏర్పాటు చేశారు. అన్ని కెమెరాలూ జిల్లా కేంద్రంలోని కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానమై ఉంటాయి. అలాగే ఇంటర్‌ బోర్డు నుంచి ఒకరు, రెవెన్యూ శాఖ నుంచి ఒకరు, పోలీస్‌ డిపార్టుమెంట్‌ నుంచి ఒకరు మొత్తం ముగ్గురితో మూడు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశారు. వీరు నిరంతరం అన్ని కేంద్రాలనూ పర్యవేక్షిస్తూ ఉంటారు. అలాగే అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. పరీక్షా కేంద్రాలకు వంద మీటర్ల వరకు జిరాక్స్‌ షాపులు మూసివేస్తారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యంతోపాటు గదుల్లో తగినంత వెంటిలేషన్‌ ఉండేలా చర్యలు చేపట్టామని ఇరు జిల్లాల అధికారులు తెలిపారు. అన్ని కేంద్రాల్లో ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లతో ఒక ఎఎన్‌ఎం ఉండేలా వైద్యఆరోగ్య శాఖ ద్వారా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఉదయం ఏడు గంటల నుంచి పరీక్షా కేంద్రాలకు బస్సులు అందుబాటులో ఉండేలా, ఆ బస్సుల్లో విద్యార్థులకు ప్రాధాన్యతిచ్చేలా చర్యలు తీసుకున్నామని, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా విద్యుత్‌ శాఖ అధికారులకు కూడా కలెక్టర్‌ తగిన ఆదేశాలు జారీ చేశారని వారు తెలిపారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఒక నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. మాల్‌ ప్రాక్టీస్‌ జరిగితే సంబంధిత డిపార్టుమెంట్‌ ఆఫీసర్‌, చీఫ్‌ సూపరింటెండెంట్‌లపైనా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

➡️