పట్టిసీమ.. యాత్రికులతో కిటకిట

Mar 8,2024 22:56

శివక్షేత్రాన్ని దర్శించుకున్న 1.50 లక్షల మంది
అన్ని శాఖల సమన్వయంతో ఇబ్బందుల్లేకుండా చర్యలు
పలువురు దాతల అన్నదాన కార్యక్రమాలు
ప్రజాశక్తి – పోలవరం
మహాశివరాత్రిని పురస్కరించుకుని పట్టిసీమ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం యాత్రికులతో కిటకిటలాడింది. శుక్రవారం రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 1.50 లక్షల మంది యాత్రికులు పట్టిసీమ శివ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచే పట్టిసీమ శివ క్షేత్రానికి యాత్రికుల తాకిడి ఎక్కువైంది. గురువారం రాత్రికే పట్టిసీమ శివ క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఇసుక తెన్నెల్లో అధికారులు ఏర్పాటు చేసిన చలువ పందిళ్లలో సేదతీరి, ఉదయం గోదావరి నదిలో స్నానాలు చేసి పితృదేవతలకు పిండ ప్రదానాలు చేశారు. నూతన దంపతులు చలిగంగ స్నానాలు ఆచరించారు. దేవాదాయ రెవెన్యూ, పోలీస్‌, వైద్య ఆరోగ్య, మత్స్యశాఖ, ఎపి టూరిజం, విపత్తుల శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖ, శిశు సంక్షేమ శాఖ, జిల్లా పంచాయతీ శాఖ, అటవీ శాఖ, పౌరసరఫరా శాఖాధికారులు పరస్పర సహాయ సహకారాలతో యాత్రికులకు ఎలాంటి లోటు పాట్లు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. పట్టిసీమకు వచ్చే భక్తులకు గోదావరి నదికి ఇరువైపులా పలువురు దాతలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కన్నాపురం అడ్డరోడ్డు వద్ద జంగారెడ్డిగూడెం నుంచి వచ్చిన దాతలు అన్నదానం నిర్వహించగా, పట్టిసీమ ఫెర్రీ రేవు వద్ద హుకుంపేట జమీందారు హౌతా వీరభద్రయ్య అన్నదాన సత్రంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఆ ప్రాంతానికి సమీపంలో సత్యసాయి సేవా సంస్థలు కూడా అన్నదానం నిర్వహించారు. గోదావరి నది ఇసుక తిన్నెలో రాజమహేంద్రవరం కొవ్వూరు నుంచి వచ్చిన దాతలు చేపట్టిన పంచభక్ష పరమాన్నాలు భక్తులను ఎంతగానో అలరించాయి. అదే ప్రాంతంలో పోలవరం కొణతాల బ్రదర్స్‌, వింజరం మాస్టారు బ్రాహ్మణ అన్నదాన సత్రం, మండవల్లి నాగ వీరభద్రరావు ఆర్యవైశ్య అన్నదాన సత్రం వేలాదిమంది యాత్రికుల ఆకలిని తీర్చాయి. ఇసుక తిన్నెల్లో రాకపోకలు సాగించేవారికి శుక్రవారం తపన చౌదరి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు మజ్జిగ, పెరుగు, వాటర్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు. 40 వేల మజ్జిగ ప్యాకెట్లు, 40 వేల పెరుగు ప్యాకెట్లు, 80 వేల వాటర్‌ ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. బిజెపి రాష్ట్ర మహిళా కార్యవర్గ సభ్యురాలు భార్గవ్‌ వెంకటలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి కరిబండి నాగరాజు, జిల్లా నాయకులు, పలువురు దాతలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న అధికారులు
పట్టిసీమ శివక్షేత్రాన్ని దర్శించుకున్న మంత్రి వనిత
పట్టిసీమ శివక్షేత్రాన్ని మంత్రి తానేటి వనిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం పట్టిసీమ మహాశివుని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో దర్శించుకున్నట్లు చెప్పారు. శుక్రవారం మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలంతా కలిసి పరమేశుని దర్శించుకున్నారన్నారు. యాత్రికులకు ఎలాంటి లోటుపాట్లు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని అధికారులను అభినందించారు.
బలివేకు లక్ష మందికి పైగా యాత్రికులు
ముసునూరు : మహాశివరాత్రిని పురస్కరించుకుని మండలంలోని బలివే గ్రామంలో శ్రీ రామలింగేశ్వరస్వామి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం కళ్యాణం రోజున సుమారు లక్ష మందికి పైగా యాత్రికులు వచ్చారని ఆలయాధికారి నల్లూరి సతీష్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు తమ్మిలేరు స్నానాలు (జల్లు స్నానాలు) చేసి స్వామివారిని దర్శించుకున్నారు. నూజివీడు ఎంఎల్‌ఎ మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు, దెందులూరు ఎంఎల్‌ఎ అబ్బయ్య చౌదరి, నూజివీడు టిడిపి, జనసేన ఉమ్మడి అభ్యర్థి కొలుసు పార్ధసారధి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ శ్రీపూజ, నూజివీడు సివిల్‌ కోర్టు జడ్జి శైలజలు విఐపి దర్శనం చేసుకునే సమయంలో సామాన్య భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీస్‌, రెవెన్యూ, ఎంపిడిఒ, పలు శాఖాధికారులు తమ సిబ్బందితో కలిసి యాత్రికులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. ఉత్సవాల్లో కుసమహార సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ, తాగునీరు, బిస్కెట్లు పంపిణీ చేశారు. కొలుసు పార్ధసారధి చక్కెరపొంగలి, పులిహోర, వాటర్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు. తపన ఫౌండేషన్‌ వారి ఆధ్వర్యంలో పులిహోర దద్దోజనం, వాటర్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు. సత్య సాయి సేవా సంస్థ వారు తాగునీరు పంపిణీ చేశారు. తమ్మిలేరు జల్లు స్నానాల వద్ద భక్తులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

➡️