ప్రభుత్వ వాగ్దానాలు అమలు చేయాలి

అంగన్వాడీ జిల్లా కార్యదర్శి పి.భారతి

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌

అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చేపట్టిన 42 రోజుల సమ్మె పరిష్కారం సందర్భంగా ప్రభుత్వం చేసిన వాగ్దానాలు తక్షణమే అమలు చేయాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి పి.భారతి విజ్ఞప్తి చేశారు. ఆదివారం స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లా సమావేశంలో భారతి మాట్లాడుతూ 42 రోజుల సమ్మె వేతనాలు మంజూరు చేస్తూ జిఒ జారీ చేశారని, దానికనుగుణంగా తక్షణమే వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మినీ వర్కర్లను మెయిన్‌ వర్కర్లుగా చేస్తానని సమ్మె సందర్భంగా చేసిన వాగ్దానాన్ని తక్షణమే అమలు చేయాలని కోరారు. గ్రాట్యుటీ పెంచుతూ చేసిన నిర్ణయాన్ని వెంటనే జిఒ జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీలపై రోజురోజుకూ పనిభారం పెంచుతున్నారని, అంగన్వాడీలపై వేధింపులు ఆపివేయాలని డిమాండ్‌ చేశారు. నాణ్యమైన సెల్‌ ఫోన్‌లు ఇవ్వకుండా ఆన్‌లైన్‌ పనుల పేరుతో తీవ్రంగా ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో యూనియన్‌ నాయకులు కె.విజయలక్ష్మి, శ్రావణి, లక్ష్మీపార్వతి, వెంకటలక్ష్మి, కమల, రాహేలు పాల్గొన్నారు.

➡️