‘మంచి కళాకారున్ని కోల్పోయాం’

టి.నర్సాపురం : కళామతల్లి ముద్దుబిడ్డ బుర్రకథల బ్రహ్మం వంటి మంచి కళాకారున్ని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉందని ప్రముఖ కవి, రచయిత, కళాకారుడు తిప్పాభట్ల రామకృష్ణ అన్నారు. మండలంలోని బొరంపాలెం గ్రామానికి చెందిన బుర్రకథల బ్రహ్మం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో సంతాప సభను బుధవారం సరస్వతీ బుర్రకథ దళం ప్రధాన కథకుడు వీరమల్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆయన స్వగృహంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సహాయ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ వీరమల్ల మధు అధ్యక్షతన జరిగిన సభలో పాల్గొన్న ప్రజానాట్యమండలి ఏలూరు జిల్లా సబ్‌ కమిటీ కన్వీనర్‌ టివిఎస్‌ రాజు మాట్లాడుతూ హాస్యం అంటే వ్యంగ్యంగా బూత్‌ అర్థాలు వచ్చే విధంగా హాస్యం పండిస్తున్న ఈ కాలంలో బ్రహ్మచారి హాస్యం అంటే ఓ ప్రత్యేకత సంతరించుకునే విధంగా హాస్యానికి ఒక ఆశయం ఉండాలని తాను నమ్మిన ఆశయానికనుగుణంగా బుర్రకథలు హాస్యం చెప్పే వారిని కొనియాడుతూ తిప్పర్తి వీరబ్రహ్మం తన కళని ఇంటిపేరుగా మార్చుకొని, బుర్రకథ బ్రహ్మంగా పేరు సంపాదించుకున్న వక్తని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ బుర్రకథ కళాకారులు చిలుకూరి సుబ్బయ్య చారి, టివిఎస్‌ రాజు, షేక్‌ సుభాని, తోట సత్యనారాయణ, బిఎన్‌.సాగర్‌, బచ్చు జగ్గయ్య, ఫ్రాన్సిస్‌, వీరమల్ల మధు, పలువురు కళాకారులు నివాళులర్పించారు

➡️