రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

మాసోత్సవాల ముగింపులో జిల్లా ప్రజా రవాణా శాఖాధికారి ఎన్‌విఆర్‌ వరప్రసాద్‌

ఏలూరు అర్బన్‌: రోడ్డు భద్రతా మాసోత్సవాలు సందర్భంగా గత నెల రోజులుగా సిబ్బందికి శిక్షణ తరగతులు, ట్రాఫిక్‌ నియమాలు, మంచి ఆహారపు అలవాట్లతో పాటు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశామని జిల్లా ప్రజా రవాణా శాఖాధికారి ఎన్‌విఆర్‌ వరప్రసాద్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భద్రతా మసోత్సవ ముగింపు సభ శుక్రవారం ఏలూరు ఆర్‌టిసి గ్యారేజ్‌లో నిర్వహించారు. ఆర్‌టిసి జోనల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కె.గోపీనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ సంస్థలో డ్రైవర్‌ పాత్ర చాలా కీలకమైందన్నారు. బస్సు నడిపేటప్పుడు ఏకాగ్రత చాలా అవసరమని, దేశవ్యాప్తంగా జరిగేటువంటి ప్రమాదాల్లో కేవలం ఎపిఎస్‌ఆర్‌టిసి మాత్రమే అతి తక్కువ ప్రమాదాల జాబితాలో ఉందని, అందుకు అహర్నిశలు శ్రమిస్తున్న డ్రైవర్‌, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాక ఈ సంస్థలో 33 సంవత్సరాల పాటు ఒక ప్రమాదం కూడా లేకుండా అద్భుతమైన చాకచక్యంతో కూడిన ప్రతిభావంతులైన డ్రైవర్లు ఉండటం విశేషమన్నారు. డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ ఎస్‌. శాంతకుమారి మాట్లాడుతూ మంచి అలవాట్లతో కూడిన జీవనాన్ని కొనసాగించాలన్నారు. ముఖ్య అతిథి జిల్లా ఎస్‌పి డి.మేరీ ప్రశాంతి మాట్లాడుతూ వారి తండ్రి కూడా ఆర్‌టిసి డిపో మేనేజర్‌గా చేశారని, ఆర్‌టిసితో తనకు మంచి అనుబంధం ఉందని తెలిపారు. అనంతరం ఉత్తమ డ్రైవర్లను శాలువాతో సన్మానించి, నగదు బహుమతి అందజేశారు. అలాగే మాసోత్సవాల సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

➡️