సమస్యలు పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మికుల ఆందోళన

ప్రజాశక్తి – ఏలూరు
భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, 1214 మెమోను రద్దు చేయాలని కోరుతూ స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నానుద్దేశించి భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎర్ర రాంబాబు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న వెల్ఫేర్‌ బోర్డును నిర్వీర్యం చేశారన్నారు. వారికి గతంలో సంక్షేమ పథకాలు అమల చేసేవారని, జగన్‌ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక సంక్షేమ పథకాలన్నీ ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వి.సాయిబాబు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు నిలుపుదల చేస్తూ ఇచ్చిన 1214 జిఒలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం భవన నిర్మాణ సెస్‌ సొమ్మును భవన నిర్మాణ కార్మికులకు ఖర్చు పెట్టాలని చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. భవన నిర్మాణ మెటీరియల్‌ ధరలు నియంత్రించాలని, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, దారిమళ్లించిన భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్‌ బోర్డు నిధులు రూ.1150 కోట్లు వెనక్కు జమ చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అనంతరం తహశీల్దార్‌ కార్యాలయ సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షులు బి.జగన్నాధరావు, యూనియన్‌ నాయకులు పరస శ్రీను, కోనపు రెడ్డిరాజా, ఎస్‌కె.భాషా, ఆకుల దుర్గారావు, కొరడా నాయుడు తదితరులు పాల్గొన్నారు. పెదపాడు: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు కొనసాగించాలని, దారి మళ్లించిన నిధులను వెంటనే వెల్ఫేర్‌ బోర్డు ఖాతాలో జమ చేయాలని జిల్లా ఆటో అండ్‌ ట్రాలీ డ్రైవర్స్‌ యూనియన్‌ (సిఐటియు) నగర కార్యదర్శి మెరుగు వీరరాఘవులు డిమాండ్‌ చేశారు. అప్పనవీడు గ్రామంలో చేపట్టిన భవన నిర్మాణ కార్మికుల రిలే నిరాహార దీక్షలనుద్దేశించి రాఘవులు మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న వెల్ఫేర్‌ బోర్డు నిధులను వారి సంక్షేమానికి వినియోగించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పథకాలకు సంక్షేమ బోర్డు నిధులను మళ్లించడం దారుణమని విమర్శించారు. తక్షణమే వెల్ఫేర్‌ బోర్డును కొనసాగించాలని, లేనిపక్షంలో భవన నిర్మాణ కార్మికులకు, రవాణా రంగ కార్మికులు సంపూర్ణ మద్దతు ప్రకటించి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. వాసు, శ్రీనివాసరావు, నాగమల్లికార్జునరావు, జగన్‌, రవితేజ తదితరులు భవన నిర్మాణ కార్మికులకు మద్దతు తెలిపారు.

➡️