మొరాయించిన ఆర్‌టిసి బస్సు

ఎండలో ప్రయాణికుల పాట్లు
ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం టౌన్‌
జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన ఆర్‌టిసి బస్సు సాంకేతిక లోపం కారణంగా ఆగిపోయింది. డిపో నుంచి బయలుదేరి డిపోకు కూత వేటు దూరంలో ఉన్న గురవాయిగూడెం గ్రామం ఎంట్రన్స్‌లో బస్సు ఆగిపోయింది. దీంతో బస్సులో ప్రయాణికులు ఎండలో పడిగాపులు పడ్డారు. సుమారు గంట తర్వాత మరో బస్సులో ప్రయాణికులను వారి గమ్యస్థానాలకే చేర్చేందుకు ఆర్‌టిసి అధికారులు ఏర్పాట్లు చేశారు. జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన బస్సులు తరచూ ఏదో లోపం కారణంగా ఎక్కడపడితే అక్కడ ఆగిపోతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పని నిమిత్తం, హాస్పిటల్‌ పనిపై వెళ్తున్న సమయంలో బస్సులు ఆగిపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వాపోతున్నారు. జంగారెడ్డిగూడెం డిపోలో పని చేయని బస్సులకు మరమ్మతులు చేయకుండా అధికారులు ప్రయాణాలకు ఉపయోగించి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. పలుమార్లు జంగారెడ్డిగూడెం డిపోపై విమర్శలు వచ్చినా ఆర్‌టిసి అధికారుల్లో మాత్రం ఎటువంటి చలనం ఉండటం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్సులకు మరమ్మతులను నిర్వహించాలని కోరుతున్నారు.

➡️