ఉపాధి కూలీ బకాయిలు విడుదల చేయాలి

వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన వినతి

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌

పెండింగ్‌లో ఉన్న నాలుగున్నర కోట్ల ఉపాధి హామీ వేతన బకాయిలు విడుదల చేయాలని, ఏలూరు నగరంలో విలీనం చేసిన ఏడు గ్రామ పంచాయతీల పేదలకు ఉపాధి పనులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ తెలిపారు. శనివారం డ్వామా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఎ.రాముకి సంఘం జిల్లా కమిటీ బృందం డ్వామా కార్యాలయంలో వినతిని అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వేతన బకాయిలు సుమారు నాలుగున్నర కోట్ల రూపాయలు ఉన్నాయన్నారు. కానీ అవి నేటికీ విడుదల చేయకపోవడంతో పేదలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క వ్యవసాయ పనులు లేక ఇబ్బంది పడుతుంటే ఆసరాగా ఉన్న ఉపాధి పనులకు వెళితే నేటికీ కూలీలకు రావాల్సిన వేతనాలు సకాలంలో రాకపోవడంతో ఉపాధి కూలీల కుటుంబాలు అప్పుల పాలయ్యాయన్నారు. కూలీల పని నాణ్యత గురించి చర్చోపచర్చలు చేస్తున్న అధికారులు వారికి రావాల్సిన వేతనాలు కనీసం 15 రోజులకు ఇవ్వాల్సి ఉందని తెలియదా అని ప్రశ్నించారు. కూలీల పట్ల ఉపాధిహామీ అధికారుల తీరు మార్చుకోవాలని హిత బోధ చేశారు. ఉపాధి పనులు చేస్తున్న కూలీలు ఉంటేనే ఈ సంస్థ నడుస్తుందని గుర్తు చేశారు. ఏప్రిల్‌ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించే పనులు వెంటనే అన్ని మండలాల్లో ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. పాత వేతన బకాయిల విడుదల చేయాల్సి ఉండగా ప్రభుత్వం విడుదల చేయకపోవడం దుర్మార్గమన్నారు. ఏలూరు నగరంలో విలీనం చేసిన గ్రామాలకు ఉపాధి హామీ పనులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు పని దినాలు పెంచాలన్నారు. లేనిపక్షంలో ఆందోళన పోరాటాలకు సన్నద్ధమవుతావని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్‌, ఆగేశయమ్మ, ఆనందరావు, సుధమ్మ పాల్గొన్నారు.

➡️