సాగుకు సాయం ఎప్పుడో..!

ప్రారంభమైన ఖరీఫ్‌ సాగు
 కొత్త ప్రభుత్వ రూ.20 వేలు ఆర్థిక సాయం హామీ అమలుపై చర్చ
రెండు జిల్లాల్లో 2.50 లక్షల మందికిపైగా రైతులు ఎదురుచూపు 
పిఎం కిసాన్‌ తొలివిడత ఆర్థిక సాయం విడుదల
రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తుందో స్పష్టత కరువు
ఆర్థిక సాయంపై కౌలురైతులంతా గంపెడాశలు
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి
ఖరీఫ్‌ సాగు ప్రారంభమైంది. రైతులు నారుమడులు ముమ్మరంగా వేయడం ప్రారంభించారు. దీంతో వ్యవసాయానికి ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయంపై రైతుల్లో చర్చ మొదలైంది. కొత్త ప్రభుత్వం రైతులకు అందించే రూ.20 వేలు ఆర్థిక సాయం ఎప్పడు అందిస్తుందోనని జిల్లా రైతాంగం ఎదురుచూస్తోంది. గత ప్రభుత్వం ప్రతియేటా కేంద్రం ఇచ్చే రూ.ఆరు వేలతో కలిపి రైతుభరోసా సాయం కింద రూ.13,500 రైతుకు అందించేది. రైతుభరోసా సాయం అందుకుంటున్న రైతులు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 2.50 లక్షల మందికిపైగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మూడు విడతలుగా రూ.ఆరు వేలు, రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్‌ ఆరంభంలో భాగంగా మే చివరి వారంలో మొదటివిడతగా రూ.5,500, జనవరిలో రెండో విడతగా రూ. రెండువేలు రైతుభరోసా సొమ్ము జమ చేసేది. కేంద్రంలో మోడీ సర్కార్‌నే మళ్లీ అధికారంలోకి రావడంతో మంగళవారం పిఎం కిసాన్‌ కింద రైతులకు అందించే మొదటి విడత సొమ్మును కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో కొత్తగా టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఆర్థికసాయం అందిస్తామని హామీ ఇచ్చింది. కేంద్రం ఇచ్చే రూ.ఆరు వేలతో కలిపి రూ.20 వేలు ఇస్తుందా.. లేక రాష్ట్ర ప్రభుత్వమే రూ.20 వేలు అందిస్తుందా ఇంకా తేలాల్సి ఉంది. కేంద్రం రైతులకు పెట్టుబడి సాయం విడుదల చేయడంతో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎప్పుడు అందిస్తుందోననే చర్చ రైతుల్లో కొనసాగుతోంది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో రైతులకు విత్తనాలతోపాటు ఎరువులు, ఇతర ఖర్చుల కోసం పెట్టుబడి అవసరం ఉంటుంది. అందుకే గత ప్రభుత్వం కూడా ఖరీఫ్‌ ఆరంభంలో మొదటి విడత రైతుభరోసా సొమ్ము విడుదల చేసేది. కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో అనేక అనుమానాలు సైతం రైతుల్లో నెలకొన్నాయి. గత ప్రభుత్వం అందించిన రైతుభరోసా అర్హుల జాబితా ప్రకారం ఆర్థిక సాయం అందిస్తుందా.. లేక మళ్లీ అర్హుల జాబితా తయారీ కోసం ఆదేశాలు ఇస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే ప్రస్తుత ఖరీఫ్‌లో రైతులకు పెట్టుబడి కోసం అందించే ఆర్థిక సాయం అందకుండా పోయే పరిస్థితి ఏర్పడనుంది. ఈ నెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అంతకు ముందు రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది. ఈ సమావేశంలో రైతులకు అందించే ఆర్థిక సాయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. రైతులకు అందించే ఆర్ధికసాయంలో ఆలస్యం జరిగితే మాత్రం కొత్త ప్రభుత్వంపై అన్నదాత ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడనుంది. ఆర్థిక సాయంపై కౌలురైతుల్లో గంపెడాశలు ప్రభుత్వం రైతులకు అందించే ఆర్థిక సాయంపై జిల్లాలోని కౌలురైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. రెండు జిల్లాల్లో దాదాపు మూడు లక్షల మంది కౌలురైతులు ఉన్నారు. జిల్లా వ్యవసాయ సాగులో 70 శాతానికిపైగా వీరే చేస్తున్నారు. అయితే సాగు చేస్తున్న కౌలురైతులకు కాకుండా ప్రభుత్వం పెట్టుబడి సాయం సొమ్ము వ్యవసాయం చేయని భూయజమానుల ఖాతాల్లో వేస్తోంది. దీంతో సాగు చేసే కౌలురైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత వైసిపి ప్రభుత్వం అందించిన రైతుభరోసా సాయం సైతం కౌలురైతులకు పెద్దగా అందని పరిస్థితి ఉంది. టిడిపి కూటమి ఎన్నికల్లో కౌలురైతులకు పెట్టుబడి ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. దీంతో ప్రభుత్వం అందించే ఆర్థికసాయం సైతం తమకు అందుతుందనే ఆశతో కౌలురైతులు ఎదురుచూస్తున్నారు. కొత్త ప్రభుత్వం కౌలురైతులకు ఆర్థిక సాయం అందించేందుకు ఏవిధంగా ముందుకు సాగుతుందో వేచిచూడాలి.

➡️