ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన ప్రజానాట్యమండలి

May 25,2024 21:54

ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో వక్తలు
ప్రజాశక్తి – టి.నరసాపురం
మండలంలోని బొర్రంపాలెం గ్రామంలో ప్రజా నాట్యమండలి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజా నాట్యమండలి ఏలూరు జిల్లా సబ్‌ కమిటీ కన్వీనర్‌ టివిఎస్‌.రాజు మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఇతివృత్తంగా తీసుకుని వివిధ కళారూపాలను ప్రదర్శించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన ఏకైక ప్రజా కళా సంస్థ ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి అన్నారు. ప్రముఖ విప్లవ కళాకారులు మాదాల రంగారావుతో పాటు సినీ రంగానికి చెందిన పలువురు కళాకారులు ప్రజా నాట్యమండలి ద్వారా వచ్చిన వారేనని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ఆర్‌.కృష్ణబాబు మాట్లాడుతూ తాను ప్రజానాట్యమండలి ద్వారా పల్లె నుంచి ఢిల్లీ వరకు కళా ప్రదర్శన నిర్వహించడానికి ప్రజానాట్యమండలి దోహదపడిందని తెలిపారు. ప్రముఖ బుర్రకథ కళాకారులు వీరమల్ల సత్యనారాయణ మాట్లాడుతూ దశాబ్దాలుగా జానపద కళలు ప్రదర్శించే అవకాశం ప్రజానాట్యమండలి కల్పించిందన్నారు. ప్రముఖ రంగస్థల కళాకారుడు వెలగపాడు రత్నం మాట్లాడుతూ కళాకారులు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పౌరాణిక కళాకారుడు తోట సత్యనారాయణ, నెల్లూరు రామానాయుడు పాల్గొన్నారు.

➡️