నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి

సిఎం చంద్రబాబుకు, మంత్రులకు సిపిఎం బృందం వినతి
ప్రజాశక్తి – పోలవరం
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై సిపిఎం జిల్లా కమిటీ సిఎం చంద్రబాబుకు, మంత్రులకు వినతిపత్రాలు అందించినట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రవి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వాసితుల త్యాగాల పునాదు లపై పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నా ఆచరణలో నిర్వాసితులకు పునరావాసం, సమస్యలపై దృష్టి సారించడం లేదన్నారు. ప్రభుత్వాలన్నీ ఇదే వైఖరి అవలంబిం చడం దారుణమన్నారు. 15 ఏళ్లలో ప్రాజెక్టు నిర్మాణం 75 శాతాని కిపైగా పూర్తవ్వగా పునరావాసం మాత్రం పది శాతం కూడా మించ లేదని అన్నారు. పునరావాసం కల్పించిన వారికి సైతం సౌకర్యాల్లేక విలవిల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో ముంప ునకు గురయ్యే ప్రాంతాలను ప్రభుత్వాలు అశాస్త్రీయంగా గుర్తించా యని, 2022 జులైలో వచ్చిన వరదల్లో 41.5 కాంటూరు పైబడిన గ్రామాలు సైతం మునిగిపోయాయని గుర్తు చేశారు. ఏలూరు జిల్లాలో పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని 25 వేల కుటుంబాలు, లక్ష మంది నిర్వాసితులవుతున్నారని తెలిపారు. వీరిలో అత్యధికులు గిరిజనులేనని, వీరికి పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో పునరావాస కాలనీలు నిర్మించారని తెలిపారు. ఈ కాలనీల్లో సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయని, ఒక్క కుటుంబానికీ పునరావాసం పూర్తిస్థాయిలో కల్పించలేదని తెలిపారు. సమస్యలపై అధికారులకు ఎన్నిసార్లు వినతులిచ్చినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ చట్టాలు, 2013 భూసేకరణ చట్టం అమలు కావడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు శ్రద్ధ వహించి నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం నిర్వాసితులకు పునరావాసం కల్పించాకే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఖాళీ చేయించే రోజునే కటాఫ్‌ తేదీగా నిర్ణయించి 18 ఏళ్లు నిండిన వారికి ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, గృహనిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారధి, పోలవరం ఎంఎల్‌ఎ చిర్రి బాలరాజుకు వినతిపత్రాలు అందించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ, మండల కార్యదర్శి గుడెల్లి వెంకట్రావు, జిల్లా కమిటీ సభ్యులు వై.నాగేంద్ర, దుర్గారావు, మండల కమిటీ సభ్యులు సముద్రాల సాయికృష్ణ, నిర్వాసితుల కమిటీ సభ్యులు తాటి శాంతి పాల్గొన్నారు.

➡️