బహుముఖ ప్రజ్ఞాశాలి మోటూరు హనుమంతరావు

23వ వర్థంతి సభలో వక్తలు
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌
మోటూరు హనుమంతరావు సిపిఎం, ప్రజాశక్తి దినపత్రిక అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి కొనియాడారు. మోటూరు హనుమంతరావు 23వ వర్థంతి కార్యక్రమం సిపిఎం జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. మోటూరి హనుమంతరావు చిత్రపటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌.లింగరాజు పూలమాల వేసి నివాళులర్పించగా మిగిలిన సభ్యులు పూలు ఉంచి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.కిషోర్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎ.రవి మాట్లాడుతూ మోటూరి హనుమంతరావు సిపిఎం రాష్ట్ర నాయకులు, ప్రజాశక్తి సంపాదకులుగా దీర్ఘకాలం పని చేశారన్నారు. ఆయన మంచి ఉపన్యాసకుడు, రచయతగా ఉండేవారని తెలిపారు. సవ్యసాచి అయిన అర్జునుడి వలే ఏకకాలంలో అనేక కార్యక్రమాలు నిర్వహించగలిగే సామర్థ్యం కలిగిన వ్యక్తి మోటూరి హనుమంతరావు అని కొనియాడారు. ప్రజాప్రతినిధిగా, మంచి ఉపన్యాసకుడిగా, రచయతగా, తోటి కార్యకర్తలపై అపారమైన అభిమానంతో వ్యవహరించడంలో ఆయన గొప్పవారిగా పేరు పొందారన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యునిగా, పొలిట్‌ బ్యూరో సభ్యునిగా, ప్రజాశక్తిని తిరిగి ప్రారంభించడమే కాకుండా దానిని గాడిలో పెట్టే విధంలో సంపాదకునిగా పని చేసిన నాయకుడు మోటూరి హనుమంతరావు అని తెలిపారు. ఆయన ఆశయాలు, ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్లే బాధ్యత కమ్యూనిస్టులుగా, కార్యకర్తలుగా మనపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి.రామకృష్ణ, సిపిఎం నాయకులు బి.సోమయ్య, కంది విశ్వనాధం, వి.సాయిబాబు, బి.జగన్నాధరావు, కోటేశ్వరరావు, పి.సూర్యారావు, ఆర్‌విఎస్‌.నారాయణ, ప్రసాద్‌, గంగరాజు, సత్యం, సీతారాం పాల్గొన్నారు.
ప్రజాశక్తి పత్రిక తొలి సంపాదకులుగా మోటూరు హనుమంతరావు పత్రిక అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని ప్రజాశక్తి పత్రిక ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా డెస్క్‌ ఇన్‌ఛార్జి విఎస్‌ఎస్‌వి.ప్రసాద్‌ కొనియాడారు. మోటూరు హనుమంతరావు 23వ వర్థంతి కార్యక్రమం స్థానిక ప్రజాశక్తి కార్యాలయంలో నిర్వహించారు. ముందుగా మోటూరి హనుమంతరావు చిత్రపటానికి డెస్క్‌ ఇన్‌ఛార్జి ప్రసాద్‌, స్టాఫ్‌ రిపోర్టర్‌ గంగరాజు పూలమాల వేసి నివాళులర్పించగా మిగిలిన సభ్యులు పూలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డెస్క్‌ ఇన్‌ఛార్జి శివప్రసాద్‌ మాట్లాడుతూ మోటూరి హనుమంతరావు సిపిఎం రాష్ట్ర నాయకులుగా, ప్రజాశక్తి సంపాదకులుగా దీర్ఘకాలం పనిచేశారని ఆయన మంచి ఉపన్యాసకుడు, రచయతగా ఉండేవారని కొనియాడారు. ఎంఎల్‌ఎగా, రాజ్యసభ సభ్యునిగా, సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యునిగా, పొలిట్‌ బ్యూరో సభ్యునిగా పనిచేశారన్నారు. ఆయన ఆశయాలు, ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా ప్రజాశక్తి సిబ్బంది పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాశక్తి సిబ్బంది సీతారాం, సాంబమూర్తి, శ్యామ్‌, సత్యవతి , స్పందన, లక్ష్మణ్‌, సునీత, స్నేహలత తదితరులు పాల్గొన్నారు.

➡️