సిహెచ్‌సి సిబ్బంది పని తీరు మార్చుకోవాలి

విధుల్లో అలసత్వం వహిస్తే సహించం
వైద్య సిబ్బందిపై ఐటిడిఎ పిఒ సూర్యతేజ ఆగ్రహం
ప్రజాశక్తి – బుట్టాయగూడెం
బుట్టాయగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పనితీరు మార్చుకోవాలని, విధుల్లో అలసత్వం వహిస్తే సహించబోమని, రోగులతో దురుసుగా ప్రవర్తించకుండా మెరుగైన వైద్య సేవలందించాలని ఐటిడిఎ పిఒ సూర్యతేజ అన్నారు. బుట్టాయగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన బుధవారం అర్ధరాత్రి సమయంలో సందర్శించారు. వైద్యం పొందుతున్న రోగులను భోజనాల గురించి అడిగారు. తమకు రాత్రి భోజనం అందించలేదని రోగులు తెలిపారు. భోజనాల వివరాలు నమోదు చేసే రిజిస్టర్‌ను పరిశీలించగా భోజనాలు పెట్టకుండానే పెట్టినట్లుగా వివరాలు నమోదు చేయడం, భోజనాల వివరాల నమోదు సక్రమంగా లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు భోజనం ఏర్పాటు చేయలేకపోవడం ఏంటని ప్రశ్నించారు. భోజనాల బిల్లుల విషయం తన దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని, అంతేకాని రోగులను, అటెండర్స్‌ని పస్తులు ఉంచుతారా అన్నారు. ఇన్‌ పేషెంట్స్‌కి భోజనాలు అందుతున్నాయో లేదో తెలుసుకోకపోవడం, అవసరమైన రక్త పరీక్షలు రాయకపోవడం, రిజిస్టర్‌ గదిలో పెట్టి తాళం వేసుకుపోవడం, విధులు సక్రమంగా నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి అంతస్తులో నీటి శుద్దికరణ, శీతలీకరణ యంత్రాలు ఉన్నప్పటికీ వాటిని సక్రమంగా ఎందుకు నిర్వహించడంలేదన్నారు. అత్యవసరంలో రక్తం కొనుగోలు కోసం కొంత నిధులు ఉన్నప్పటికీ వాటిని వినియోగించడంలేదన్నారు. బుధవారం ఉదయం మోతుగూడెం గ్రామానికి చెందిన గిరిజన మహిళ ఆసుపత్రిలో ప్రసవించగా రక్తం తెచ్చుకోవాలని ఆమె భర్తకు చెప్పగా అమాయకత్వంతో ఎక్కడ తెచ్చుకోవాలో తెలియక రక్తం ఏర్పాటు చేసుకోలేకపోయిన విషయం ఆయన దృష్టికి వచ్చింది. వైద్య సిబ్బందే రక్తం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని నిలదీశారు. రోగుల పట్ల సిబ్బంది తీరు మార్చుకోవాలని, వైద్యం కోసం వచ్చిన రోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే క్షమించేది లేదన్నారు. వైద్యులు పని తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఏజెన్సీ ప్రాంతంలో పని చేస్తున్న వైద్యులకు ప్రత్యేక అలవెన్సులు కల్పిస్తున్నామని, సామాజిక ఆరోగ్య కేంద్రానికి వైద్యులు దగ్గరలో ఉండకపోతే వారు పొందే ప్రత్యేక అలవెన్సులు ఆపివేసి, ఇప్పటివరకు పొందిన వాటిని కూడా రికవరీ చేస్తామని తెలిపారు.

➡️