ఏజెన్సీలో ఉపాధి కరువు

Apr 25,2024 21:33

ఊరిలో పనిలేదు… పోడు పనులు పొట్ట నింపడం లేదు… ఉపాధి పని అరకొరగానే ఉంటోంది. చేసిన పనికి సరైన కూలి రాక కడుపు కాలిపోతోంది. దిక్కు లేక కన్నవారిని, పుట్టిన ఊరిని వదిలి దూర ప్రాంతాలకు పోవాల్సి దుస్థితి. కురుపాం నియోజకవర్గంలో దశాబ్దాలుగా రాచరికపు పాలనలో గిరిజన గోడు ఇది. మన్యంలో ఏ ఇంటి తలుపు తట్టినా ఇదే వేదన. టిడిపి, వైసిపి, బిజెపి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, స్థానిక ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోక పోవడంతో మన్యంలో ఈ దయనీయ పరిస్థితి నెలకొంది. కురుపాం నియోజకవర్గంలో ఏళ్లుగా సాగుతున్న రాచరికపు పాలనలో గిరిజన యువత పట్టణాలకు వలసపోతోంది. ఇదీ ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాలో కనిపిస్తున్న పరిస్థితి.

ప్రజాశక్తి గుమ్మలక్ష్మీపురం:  వైసిపి ఐదేళ్ల పాలనలో ఎటువంటి ఉద్యోగ అవకాశాలూ లేక ఏజెన్సీలో యువత వలసల జోరు పెరిగింది. మన్యంలో వేలాదిమంది యువత ఉన్నత చదువులు చదివారు. వీరి కోసం గుమ్మ లక్ష్మీపురం, సాలూరు, పార్వతీపురం, సీతంపేట మండలాల్లో వైటిసిలు ఏర్పాటు చేశారు. అయితే వీటి నిర్వహణ పూర్తిగా కొరవడింది. శిక్షణ ఉపాధి లేని పరిస్థితి. మరోవైపు గుమ్మ లక్ష్మీపురం మన్యంలో కొంతమంది గిరిజన మహిళలకు జీడి ప్రాసెసింగ్‌ పై చెన్నై లో శిక్షణ ఇచ్చారు. ఇందుకు సంబంధించి జెకెపాడు, దుర్భిలి లో జీడి ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేశారు. అంతా బాగానే ఉన్నా చివర నిమిషంలో పాసింగ్‌ యూనిట్లు ప్రారంభించకపోవడంతో గిరిజన మహిళలకు ఉపాధి కరువైంది. మరోవైపు డుమ్మంగి చేపల కేంద్రం , లేవిడిలో పట్టు పరిశ్రమ, గుమ్మ లక్ష్మీపురంలో ఫ్యాషన్‌ టెక్నాలజీ వంటి శిక్షణా కేంద్రాలు మూత పడ్డాయి. మరోవైపు గిరిజనులు పండించే పంటలకు సరైన గిట్టుబాటు ధర లేక పోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడం, వర్షాబావ పరిస్థితిలు వలన కరువు తాండవిస్తోంది. కురుపాం మండలం ఒబ్బంగి గ్రామంలో వందకుపైగా కుటుంబాల్లో సుమారు 500 మంది గిరిజనులు నివశిస్తున్నారు. ఇక్కడ ప్రతి ఇంటిలోనూ ఒకరిద్దరు యువకులు డిగ్రీ, పీజీ, ఇంటర్‌ పూర్తి చేసి కూలి పనులపై ఆధారపడుతున్నారు. ఊరిలో ఉపాధి దొరక్క యువకులంతా కేరళ, హైదరాబాద్‌, బెంగళూరు ప్రాంతాలకు వలసపోయారు.. చేపల చెరువుల్లోనూ, బోర్‌వెల్స్‌, భవన నిర్మాణ కార్మికులుగా కష్టపడి వచ్చిన డబ్బుతో గ్రామాలకు తిరిగొస్తున్నారు. ఒబ్బంగిలో కొండగొర్రి రమేష్‌, మూటకు వాలి, తాడంగి చందు, సింహాద్రితోపాటు గ్రామంలో 50 మందికి పైగా యువకులు వలసపోయారు. నిక్కిడి గ్రామంలో ఆరికి రంగారావు, భార్య సునీత పనుల్లేక ఇంటిల్లిపాది భవన నిర్మాణ పనులకు బెంగళూరు వలస వెళ్లారు. వీరితోపాటు బిడ్డిక దుర్గారావు, బిడ్డిక శ్రీరాం, గంగారాంతోపాటు 30 కుటుంబాలకు పైగా వలసబాట పట్టాయి. ఇలా ఒక్క ఒబ్బంగి పంచాయతీలోనే తోలుంగూడ, బుడ్డిడివలస, జలబగూడ, తియ్యాలిగూడ, సాకి, సాకిగూడ, పీరుంగూడతోపాటు 23 గ్రామాల్లో యువత వలస వెళ్లడంతో గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. మరోవైపు గిరిజనులకు పోడు పంటలే జీవనాధారం. కానీ దళారుల బారిన పడి గిరిజనులు నష్టపోతున్నా.. పాలకులు, ప్రభుత్వం యంత్రాంగం పట్టించుకోవడం లేదు. మరోవైపు అటవీ హక్కుల చట్టం అమలు కాక, పట్టాలు లేక గిరిజన రైతులు నష్టపరిహారాలకు, బ్యాంకు రుణాలకు దూరమవుతున్నారు. ఉపాధిహామీ పనులు కూడా అరకొర కావడం, ఆరేడు నెలలపాటు కూలి చెల్లించకపోవడంతో గిరిజనులకు వలసలే శరణ్యంగా మారాయి. ఏజెన్సీలో గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, జియ్యమ్మవలస, పాచిపెంట, సాలూరు, మెంటాడ మండలాల్లో ప్రతి గ్రామంలోనూ యువత వలస బాట పట్టింది. పాలకులు వీటిపై ఏనాడూ దృష్టి సారించడం లేదు. ఏజెన్సీలో ఉపాధి కల్పనకు చర్యలు చేపట్టడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా గిరిజన యువత టిడిపి, బిజెపి, వైసిపిలకు బుద్ధిచెప్పాలని నిర్ణయించుకుంది.

➡️