ఉత్సాహంగా పోస్టల్‌ బ్యాలెట్‌

May 5,2024 21:11

ప్రజాశక్తి – పార్వతీపురం రూరల్‌ : ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం ఆదివారం ప్రారంభమైన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రశాంతంగా జరిగింది. పోలింగ్‌ కేంద్రాల్లో అధిక సంఖ్యలో ఉదయం నుంచి హాజరై ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఎన్నడూ లేని విధంగా పోలింగ్‌ కేంద్రాల బయట రాజకీయ పార్టీలు శిబిరాలను ఏర్పాటు చేసుకొని ఓటింగ్‌లో పాల్గొనే ఉద్యోగ, ఉపాధ్యాయులకు తమ పార్టీలకు అనుగుణంగా ఓటు వేయాలని అభ్యర్థించడం కనిపించింది.పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల్లో మొత్తం 6812 మంది ఓటర్లకు గాను 3310 మందిఓటర్లు తొలిరోజు ఆదివారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా యేతర ఓటర్లు 1587కు గానూ 332 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. నియోజకవర్గ ఓటర్లకు వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గానికి దాదాపు 1751 ఓట్లు నమోదు కాగా, 1098 ఓట్లు పోలయ్యాయి. పార్వతీపురం ఎస్‌విడి కళాశాల ఆవరణలో జిల్లాయేతర ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో మందకోడిగా పోలింగ్‌ జరింది. 1587గానూ 332 ఓట్లు పోలయ్యాయి. కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌ కుమార్‌ పార్వతీపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, వేంకటేశ్వర డిగ్రీ కళాశాల, కురుపాం మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌, పాలకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రాలను పరిశీలించారు. జెసి, అరకు పార్లమెంటరీ నియోజకవర్గ సహాయ రిటర్నింగ్‌ అధికారి ఎస్‌ ఎస్‌ శోబిక, డిఆర్‌ఒ జి.కేశవనాయుడు, కంట్రోల్‌ రూం ఇన్‌ఛార్జి, ఎస్‌డిసి ఆర్‌వి సూర్యనారాయణ, డ్వామా పీడీ కె.రామచంద్రరావు శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద పర్యవేక్షణ చేశారు. సాలూరు : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాలుగు పోలింగ్‌ కేంద్రాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఓటు వేశారు. ఆర్వో విష్ణు చరణ్‌ దగ్గరుండి పోలింగ్‌ పర్యవేక్షించారు. నియోజకవర్గంలో 1291 పోస్టల్‌ బ్యాలెట్‌లకు గానూ తొలిరోజు 546 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. సోమ, మంగళవారాల్లో కూడా పోలింగ్‌ జరగనుంది.పాలకొండ : స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలల్లో నాలుగు మండలాలకు సంబంధించి పోస్టల్‌బ్యాలెట్‌ జరిగింది. నియోజకవర్గంలో 1539 ఓట్లు గానూ 756 ఓట్లు పోలయ్యాయి. ఓటేసేందుకు సుమారు అరగంట సమయంపట్టడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రాన్ని పరిశీలించి, సిబ్బందితో మాట్లాడారు. మరో రెండురోజుల పాటు ఓటు హక్కును వినియోగించుకోవచ్చునన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆర్‌ఒ శుభం బన్సల్‌కు సూచించారు. కురుపాం : స్థానిక మోడల్‌ స్కూలో నిర్వహించిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌లో 910 మంది ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకున్నట్టు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వి.వి. రమణ తెలిపారు. 2,241 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ కలిగిన ఉద్యోగులుండగా తొలిరోజు 910 మంది ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

➡️