సమానత్వంతోనే జాతి నిర్మాణం

Apr 10,2024 20:31

పూలే విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న వీసీ పి.రాజశేఖర్‌ తదితరులు
ప్రజాశక్తి – ఎఎన్‌యు :
మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి ఉత్సవాలను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయలోని మహాత్మా జ్యోతిరావు పూలే అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. పూలే విగ్రహానికి వీసీ ప్రొఫెసర్‌ పి.రాజశేఖర్‌, ఇతర అతిథులు పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం ‘పూలే ఫిలాసఫీ, ఆలోచన విధానం’ అంశంపై జరిగిన సభకు జ్యోతిరావు పూలే అధ్యయన కేంద్రం కో-ఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ ఎం.త్రిమూర్తిరావు అధ్యక్షత వహించారు. వీసీ మాట్లాడుతూ దేశంలో మనుషుల మధ్య సమానత్వం కోసం పోరాడిన గొప్ప మహనీయుడు మహాత్మ పూలే అన్నారు. సంస్కర్తల జీవితాలను అధ్యయనం చేస్తే మనోవికాసం కలుగుతుందని చెప్పారు. అధ్యయనంతో సరిపెట్టకుండా వారి ఆలోచన విధానాన్ని అమల్లో పెట్టాలన్నారు. నిజాన్ని అన్వేషించే తత్వాన్ని పూలే తన సత్యశోధక్‌ సమాజ్‌ ద్వారా మనకందించారని, మానసిక బానిసత్వాన్ని విడనాడాలని గులాంగిరి పుస్తకం ద్వారా చెప్పారని అన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ ఇనుకొండ తిరుమాలై, మాట్లాడుతూ మహిళ సమానత్వం గురించి దేశంలో పోరాటాన్ని ప్రారంభించిన మొదటి వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే అన్నారు. అట్టడుగున ఉన్నవాళ్ళందరూ ఒక్కటైతే అది దేశం అవుతుందని, సాంస్కృతికంగా ఒక్కటైతే అప్పుడు సమానత్వం వస్తుదని అన్నారు. అప్పుడు మాత్రమే దేశం అనే భావన వస్తుందనే సత్యాన్ని పూలే విశ్వసించారని గుర్తుచేశారు. జాతి నిర్మాణం అనేది కుల, మతాలకు అతీతంగా అందరు సమానం అయినప్పుడు మాత్రమే జరుగుతుందన్నారు. ఇది కేవలం సామజిక న్యాయ అమలు ద్వారానే సాధ్యమని పూలే నమ్మి ఆచరించాడని తెలిపారు.. అణగారిన వర్గాల కోసమే కాకుండా బ్రాహ్మణ స్త్రీలు వారి విద్య, సంక్షేమం గురించి కూడా పోరాడి వారికి సమాన అవకాశాలను కల్పించడానికి పూలే అనేక కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. వితంతు వివాహాన్ని జరిపించిన ఘనుడు పూలే అని కొనియాడారు. ఆయన ఆలోచన విధానాన్ని నేటితరం స్ఫూర్తిగా తీసుకొని మహిళలకు సమస్త రంగాల్లో సమాన అవకాశాలు, హక్కులు కల్పించాన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టర్‌ ప్రొఫెసర్‌ వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బి.కరుణ, పాలక మండలి సభ్యులు డాక్టర్‌ వి.వెంకటేశ్వర్లు (కన్నా మాస్టారు), సీనియర్‌ అడ్వకేట్‌ వైకె, ప్రిన్సిపల్స్‌ ప్రొఫెసర్‌ పి.సిద్ధయ్య, ప్రొఫెసర్‌ స్వరూపరాణి, ప్రొఫెసర్‌ వై.అశోక్‌ కుమార్‌, ఒఎస్‌డి ప్రొఫెసర్‌ కె.సునీత, సిడిసి డీన్‌ మధుబాబు, ప్రోగ్రామర్‌ బి.కోటి యాదవ్‌, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️