దుష్ట పాలన అంతమవ్వాలి

Apr 5,2024 21:59

ప్రజాశక్తి-చీపురుపల్లి  : రాష్ట్రంలో జరుగుతున్న దుష్ట పరిపాలనను అంత మొందించాలని చీపురుపల్లి అసెంబ్లీ టిడిపి అభ్యర్థి కిమిడి కళావెంకటరావు అన్నారు. శుక్రవారం స్థానిక రాధామాధవ ఫంక్షన్‌ హాలులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.100 కోట్లతో తోటపల్లి కాలువను అభివృధ్ధి చేసి చూపిస్తామన్నారు. నియోజకవర్గంలో మూతపడిన పరిశ్రమలన్నింటిని తెరిపిస్తామన్నారు. ఇప్పుడున్న పథకాలతో పాటు సూపర్‌ సిక్స్‌ పధకాలను అమలు చేస్తామన్నారు. ఒక్క ఛాన్స్‌అని జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని అన్నారు. తీరా గెలిచిన తరువాత ఇసుక, సారా వ్యాపారాలలో లక్షలాది రూపాయలను జగన్మోహన్‌ రెడ్డి దోచుకున్నారని అన్నారు. వచ్చే ఎన్నికలలో టిడిపిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాలుగు మండలాల టిడిపి నాయకులు, చీపురుపల్లి మండల కార్యకర్తలు పాల్గొన్నారు.

బిసిలకు అన్యాయం : శ్రీనివాస్‌

గజపతినగరం : జగన్మోహన్‌ రెడ్డి పాలనలో బిసిలకు అన్యాయం చేశారని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌ విమర్శించారు. శుక్రవారం మండలంలోని కొత్తశ్రీరంగరాజపురం గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌ పాలనలో బిసిలు బిక్కుబిక్కుమంటూ బతికే పరిస్థితి ఏర్పడిందన్నారు. జగన్‌ పాలనలో సామాజిక న్యాయం కరువైందన్నారు. అనంతరం చెరువు పనుల్లో ఉన్న ఉపాధి కూలీల వద్దకు వెళ్లి రానున్న ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో జనసేన నాయకులు మర్రాపు సురేష్‌, మాజీ జెడ్‌పిటిసి మక్కువ శ్రీధర్‌, మాజీ ఎంపిపి గంట్యాడ శ్రీదేవి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పివివి గోపాలరాజు, శ్రీరామ్‌ రెడ్డి రామ్‌కుమార్‌, ఎడ్ల గోపి, వైకుంఠం ప్రదీప్‌ కుమార్‌ పాల్గొన్నారు.

అవకాశమిస్తే అభివృద్ధి చేస్తా : కోండ్రు

రేగిడి : ఎమ్మెల్యేగా గెలిపిస్తే గతం కంటే మెరుగ్గా అభివృద్ధి చేస్తానని టిడిపి రాజాం ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీ మోహన్‌ అన్నారు. చిన్న శిర్లాం గ్రామంలో శుక్రవారం ఎన్నికల ప్రచారం చేశారు. అనంతరం కోండ్రు మాట్లాడుతూ సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి రూ.10 ఇచ్చి వంద దోచుకొంటున్నారని తెలిపారు. అధిక ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పుల బాదుడుతో ఒక్కో కుటుంబంపై ప్రభుత్వం రూ.8 లక్షల భారం మోపిందన్నారు. సిఎం జగన్‌ మాటల గారడీలు తప్ప సంక్షేమం, అభివృద్ధిని గాలికి వదిలేశారన్నారు. కార్యక్రమంలో కిమిడి అశోక్‌ కుమార్‌, దూబ ధర్మారావు, మజ్జి శ్రీను, మంతిన ఉషారాణి, మజ్జి దాలినాయుడు, అప్పలనాయుడు, దుర్గారావు, దూబ అప్పలనాయుడు, పిన్నింటి వెంకటరావు, టంకాల నర్సింగరావు పాల్గొన్నారు.

వైసిపి హయాంలో కానరాని అభివృద్ధి : మాధవి

నెల్లిమర్ల : వైసిపి ఐదేళ్ల పాలనలో ఎక్కడా అభివృద్ధి జాడ కానరాలేదని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి లోకం మాధవి అన్నారు. శుక్రవారం టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కర్రోతు బంగార్రాజు, మండల అధ్యక్షులు కడగల ఆనంద్‌ కుమార్‌ ఆధ్వర్యంలో మండలంలోని వల్లూరు, బొడ్డపేట, మల్యాడ, వెంకన్న పాలెం, తమ్మాపురం గ్రామాల్లో శుక్రవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బంగార్రాజు, మాధవి మాట్లాడుతూ వైసిపి రాక్షస పాలన అంతమొందించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు సువ్వాడ రవి శేఖర్‌, మాజీ ఎంపిపి సువ్వాడ వనజాక్షి, గేదెల రాజారావు, పతివాడ తమ్మునాయుడు, కలిదిండి పాణి రాజు, పోతల రాజప్పన్న, నల్లం శ్రీనివాసరావు, కాళ్ళ రాజ శేఖర్‌, పంచాది జగన్నాథం, లెంక సన్యాసి రావు, గురాన రామారావు పాల్గొన్నారు.

టిడిపిలో చేరికలు

జామి, కొత్తవలస : మండలంలోని కలగాడ గ్రామానికి చెందిన 30 కుటుంబాలు టిడిపిలో చేరాయి. టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి నివాసం వద్ద వారంతా ఆ పార్టీలో చేరారు. దొండపర్తి అక్కులు, బోణి సత్తిబాబు, చేవ్వేటి రాధాకృష్ణ, బండారు శ్రీరాములు, దొండపర్తి అప్పారావు తదితరులు చేరగా, వారికి లలితకుమారి టిడిపి కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టిడిపి మండల ప్రధాన కార్యదర్శి వర్రి రమణ, నాయకులు మాకిరెడ్డి శ్రీలక్ష్మి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. కొత్తవలస మండలం ఎగువఎర్రవానిపాలెం, దిగువఎర్ర వానిపాలెం, చీడివలస, గొల్లలపాలెం గ్రామాలలో ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి ఇంటింటి ప్రచారం చేశారు. టిడిపి నాయకులు, మహిళలు,గ్రామస్థులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.

బొబ్బిలి : తెర్లాం మండలానికి సంబంధించి చీకటిపేట ప్రస్తుత వైసిపి సర్పంచ్‌ మూడడ్ల.పార్వతితో పాటు పలువురు టిడిపి అభ్యర్థి బేబి నాయన, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు ఆధ్వర్యాన ఆ పార్టీలో చేరారు. టిడిపిలో చేరిన వారిలో మూడడ్ల కిరణ్‌, చీకటి గాంధీనాయుడు, చీకటి తిరుపతిరావు, రెడ్డి శంకర్రావు, మూడడ్ల దాలినాయుడు, బంకురు యుగంధర్‌, ఆగూరు శ్రీను తదితరులు ఉన్నారు.

➡️