తప్పుడు కుల ధ్రువీకరణలతో నకిలీ గిరిజనులు పోటీ

May 4,2024 21:45

తోటపల్లి నిర్వాసితులకు న్యాయంచేసిన ఘనత సిపిఎందే

ఎన్నికల ప్రచారంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

ప్రజాశక్తి-విజయనగరం ప్రతినిధి/ కొమరాడ, గరుగుబిల్లి : అవినీతి పరులైన అరకు బిజెపి ఎంపి అభ్యర్థి కొత్తపల్లి గీత, కురుపాం వైసిపి అభ్యర్థి పుష్పశ్రీవాణి తప్పుడు ద్రువపత్రాలతో ఎన్నికల్లో పోటీకి తలపడుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. వీరికి ఓటేస్తే సమస్యలు పరిష్కారం కాకపోగా, గిరిజనులు మరింత దోపిడీకి గురవుతారని తెలిపారు. హిందువుల ముసుగులో బిజెపి గిరిజనులను, దళితులను, పేదలను దోచుకుంటున్నదని విమర్శించారు. మళ్ళీ మోడీ అధికారంలోకి వస్తే భవిష్యత్తు లో ఎన్నికలు జరిగే పరిస్థితి ఉండ బోదని తెలిపారు. కొమరాడ మండలంలోని కొమరాడ, కూనేరు గ్రామాల్లోనూ, గరుగుబిల్లి మండలం నాగూరు, జియ్యమ్మవలస మండల కేంద్రాల్లోనూ శనివారం జరిగిన సిపిఎం ఎన్నికల ప్రచారసభల్లో శ్రీనివాసరావు పాల్గొన్నారు. పలు గ్రామాల్లోను, కూనేరు సంతలోను సిపిఎం నాయకులకు పూలమాలలు, హారతులతో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా జరిగిన సభల్లో ఆయన మాట్లాడుతూ బిజెపి, టిడిపి, వైసిపిలు ప్రజాస్వామ్యాన్ని లాభ సాటి వ్యాపారంగా మార్చేయని అన్నారు. వేతనాలు పెంచకుండా ధరలు, వివిధ రకాల పన్నులు పెంచేశారని తెలిపారు. కమ్యూనిస్టుల పోరాటంతో జాతీయ ఉపాధి హామీ చట్టం, అటవీ హక్కులచట్టం, ఆహార భద్రత చట్టాలను అప్పటి యుపిఎ -1 ఏర్పాటు చేస్తే వాటిని బిజెపి అధికారం లోకి వచ్చాక నిర్వీర్యం చేస్తోందని అన్నారు. నిలదీయాల్సిన టిడిపి, వైసిపిలు మోడీకి పల్లకి మోస్తున్నాయని విమర్శించారు. జగన్‌, చంద్రబాబు అవినీతి కేసుల్లో కురుకు పోయారని, వాటి నుంచి బయటపడేందుకు మోడీ వద్ద మోకరిల్లుతున్నారని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా ఈ ముగ్గురూ తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. వీరి పాలనలో ఉన్న ప్రశ్రమలు మూత పడ్డాయని, కొత్తగా ఉద్యోగాలు రాలేదని వివరించారు. ఇటువంటి మోసపూరిత విధానాలకు సిపిఎం పూర్తిగా వ్యతిరేకమని అన్నారు. ఆయా పార్టీల నాయకులు అవినీతి కేసులతో జైళకు వెళ్తే సిపిఎం నాయకులు ప్రజలకోసం పోరాడి అక్రమ కేసుల్లో జైలుకు వెళ్లారని అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో ఈ ప్రాంతం అనేక సమస్యలు పరిష్కారమయ్యాయని, అనేక హక్కులు సాధించుకున్నారని తెలిపారు. ముఖ్యంగా తోటపల్లి నిర్వాసితులకు న్యాయం చేసిన ఘనత సిపిఎం దేనన్నారు.

తప్పుడు కుల ధ్రువీకరణలతో నకిలీ గిరిజనులు పోటీ

ఇదే నియోజకవర్గం నుంచి గతంలో సిపిఎం గెలిచి స్థానిక సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తిందని అన్నారు. ఇండియా వేదిక మద్దతుతో పోటీ చేస్తున్న సిపిఎం, కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. అరకు పార్లమెంట్‌ సిపిఎం అభ్యర్థి అప్పలనర్సను, కురుపాం సిపిఎం అభ్యర్థి మండంగి రమణను గెలిపించాలని కోరారు. సిపిఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ రాష్ట్రానికి మోసం చేసిన బిజెపితో టిడిపి పొత్తుపెట్టుకోవడం, వైసిపి మద్దతివ్వడం సిగ్గు చేటన్నారు. మద్యపాన నిషేదం చేస్తామన్న జగన్‌ తిరిగి మరోసారి అధికారం లోకి వచ్చేందుకు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని అన్నారు. బిజెపి, టిడిపి వైసిపి ప్రజా సమస్యలు, అభివృద్ధిపై మాట్లాడకుండా మాటల గారడితో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు పావులు కడుపుతున్నాయని అన్నారు. అందుకే సమస్యలపై చిత్త శుద్ది తో పోరాడుతున్న సిపిఎం అభ్యర్థులను గెలిపించాలన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.ఇందిర మాట్లాడుతూ ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలంటూ మోసంచేసిన మోడీ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలకు సైతం ఎసరు పెట్టిందన్నారు. ఇప్పటికీ చాలా గిరిజన గ్రామాల్లో తాగు నీరులేక గెడ్డల్లో ఊట నీరు తాగుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వంలో గిరిజనులు, దళితులు, మహిళలకు రక్షణ లేదన్నాను. తమ పార్టీకి చెందిన ఎంపి, ఎంఎల్‌ఏ అభ్యర్థులు పి. అప్పలనర్స, మండంగి రమణ చాలా మంచివారు, నిజాయితీ పరులన్నారు. అనేక ప్రజా సమస్యలపై పనిచేసి ప్రజలకు అండగా నిలబడ్డారన్నారు.

కురుపాం సిపిఎం ఎంఎల్‌ఎ అభ్యర్థి మండంగి రమణ మట్లాడుతూ తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. గిరిజన సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పు తానన్నారు. ప్రజలకు ఎర్రజెండా అండదండ గా నిలుస్తుందన్నారు. విజయనగరం జిల్లా కార్దర్శివర్గ సభ్యులు రెడ్డి శంకరరావు మాట్లాడుతూ చట్ట ప్రకారం గరిష్ఠంగా 10 ఎకరాలు పోడు భూమి అందేవిధంగా సిపిఎం పోరాడుతుందన్నారు. తోటపల్లి, జంఝావతి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సభలకు అధ్యక్షత వహించిన కొమరాడ, గరుగుబిల్లి సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి, బివి రమణ మాట్లాడుతూ నియోజక వర్గం పరిధిలోని అనేక సమస్యలపై సిపిఎం చేసిన పోరాటాలు, విజయాలను వివరించారు. ఈ సందర్భంగా అర్ధంతరంగా నిలిచిపోయిన పూర్ణపాడు – లాబేసు వంతెనను నాయకులు పరిశీలించారు.

➡️