నామినేషన్ల దాఖలు సమాప్తం

Apr 26,2024 00:33

ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌, టౌన్‌ : నామినేషన్ల చివరిరోజనైన గురువారం సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి నలుగురు నామినేషన్లు వేశారు. వైసిపి అభ్యర్థిగా అంబటి రాంబాబు నామినేషన్‌ దాఖలు చేయగా స్వంతత్ర అభ్యర్థులుగా పి.రమేష్‌, గడం రాంబాబు, ఎ.హనుమంతరావు నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారి వి.మురళీకృష్ణకు అందించారు. అంబటి రాంబాబు వెంట గుంటూరు మిర్చి యార్డు చైర్మన్‌ ఎన్‌.రాజనారాయణ, మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి, వైసిపి మండల కన్వీనర్‌ ఆర్‌.పురుషోత్తమరావు ఉన్నారు.అనంతరం మీడియాతో రాంబాబు మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులు, వారి అభిమానం చూస్తుంటే జగనన్న ప్రభుత్వాన్నే మళ్లీ కోరుకుంటున్నారని అన్నారు. జగన్‌ మోహన్‌రెడ్డి చెప్పినట్లుగానే తమ పార్టీకి 151 సీట్లు వస్తాయన్నారు. తనకు గత ఎన్నికల్లో లభించిన మెజార్టీకి ఒక్క ఓటు తగ్గినా నైతికంగా తాను ఓటమిని అంగీకరించినట్లేనని మరోసారి చెప్పారు. గత అయిదేళ్లు ఈ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధికి ఈ ఎన్నికలు ఒక రిఫరెండంగా భావిస్తానన్నారు.
22 మంది నామినేషన్లు
సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి 22 మంది అభ్యర్థులు 38 నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 18 నుండి 25 వరకు అభ్యర్థుల నుండి నామినేషన్లు స్వికరించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు తోపాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 13 మంది ఇండిపెండెంట్‌ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వైసిపి అబ్యర్థిగా అంబటి రాంబాబు, టిడిపి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా చంద్రపాల్‌, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అభ్యర్థి రంగిశెట్టి నాగేశ్వరరావు, జాతీయ జనసేన పార్టీ అభ్యర్థి గోదా వెంకట రమణ, జై భీమ్‌రావ్‌ భారత్‌ పార్టీ అభ్యర్థిగా జొన్నలగడ్డ విజరు కుమార్‌, బహుజన సమాజ్‌ వాదీ పార్టీ అభ్యర్థిగా పేరిపోగు నవీన్‌బాబు, జై భారత్‌ నేషనల్‌ పార్టీ అభ్యర్థిగా షేక్‌ దరియావలి, ఆంధ్ర రాష్ట్ర సమితి అభ్యర్థిగా కూరపాటి డేవిడ్‌రాజు నామినేషన్లు దాఖలు చేశారు. బొర్రా వెంకట అప్పారావు, షేక్‌ దరియావలీ, యోండూరి ఉమేష్‌ చంద్ర చౌదరి, సూలం రాజ్యలక్ష్మి, మేకల వేణుమాధవ్‌రెడ్డి, కందుకూరు జక్రీయా, పాడి మణికంఠ, ఎల్‌.రవికుమార్‌, మేకల సుబ్బారావు, తోట వెంకటేశ్వరరావు, ఎ.హనుమంతరావు, గడ్డం రాంబాబు, పి.రమేష్‌ నామినేషన్లు దాఖలు చేశారు. వీటిని శుక్రవారం పరిశీలిస్తామని రిటర్నింగ్‌ అధికారి మురళీకృష్ణ తెలిపారు.

వినుకొండలో 24 మంది నామినేషన్‌
ప్రజాశక్తి – వినుకొండ :
వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గానికి 24 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వైసిపి అభ్యర్థిగా బొల్లా బ్రహ్మనాయుడు, ఎన్‌డిఎ కూటమి తరుపున టిడిపి అభ్యర్థిగా జీవి ఆంజనేయులు, ఇండియా బ్లాక్‌ తరపున కాంగ్రెస్‌ అభ్యర్థులుగా చెన్నా శ్రీనివాసరావు, జల్లా ప్రసాద్‌ నామినేషన్‌ వేశారు. ఇప్పటివరకు మొత్తం 24 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆర్వో సుబ్బారావు తెలిపారు. ఆల్‌ పీపుల్స్‌ పార్టీ నుండి యమల శ్రీనివాసరావు, బహుజన సమాజ్‌ పార్టీ నుండి మసిపోగు ఏసేపు, స్వతంత్ర అభ్యర్థులుగా దాట్ల అంజిరెడ్డి, వచ్చు వెంకట రవికుమార్‌, నరాలశెట్టి శ్రీనివాసరావు, బొల్లా వీరాంజనేయులు, జెడ్డా శ్రీనివాసరావు, మొలక సీతారాం, వారణాసి రామకోటమ్మ, కూచిపూడి విజయ కుమారి, ఉస్తేలా చిన్న కాశయ్య, షేక్‌ బాజీలు నామినేషన్‌ వేశారు. జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ నుండి కూకుట్లపల్లి ప్రసాద్‌, జై భారత్‌ నేషనల్‌ పార్టీ నుండి చిరంజీవి నాయక్‌, జాతీయ జనసేన పార్టీ నుండి తిరుకోవులూరి అనిల్‌ కుమార్‌, లిపరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ నుండి వలపర్ల రమేష్‌, పిరమిడ్‌ పార్టీ నుండి గడ్డం రమణ, టిడిపి నుండి గోనుగుంట్ల లీలావతి, హరీష్‌బాబు, వైసిపి నుండి బొల్లా గిరిబాబులు నామినేషన్లు వేశారు.
కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ర్యాలీ
ఇండియా బ్లాక్‌ తరుపున కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చెసిన చెన్నా శ్రీనివాసరావు తొలుత స్థానిక కారంపూడి రోడ్డులోని పార్టీ కార్యాలయం నుండి నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి తహసీల్దార్‌ కార్యాలయంలో ఆర్‌ఓ వరదా సుబ్బారావుకు నామినేషన్‌ పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసిపి, టిడిపిలో ఏ పార్టీకి ఓటేసినా మతతత్వ పార్టీ అయిన బిజెపికి వేసినట్టేనని, ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి కాంగ్రెస్‌కు ఓటేయాలని కోరారు. దేశం మతకలహాలు లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే బిజెపిని ఓడించాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె.హనుమంతరెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు ఎ.రత్తయ్య, సిహెచ్‌.మణికంఠ పాల్గొన్నారు.

పెదకూరపాడు లో 51 నామినేషన్లు
ప్రజాశక్తి పెదకూరపాడు :
పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి 51 నామినేషన్‌లో దాఖలైనట్లు రిటర్నింగ్‌ ఆఫీసర్‌ శ్రీరాములు తెలిపారు. ప్రధాన పార్టీలు ఒక్కొక్కరు నాలుగు సెట్ల నామినేషన్‌ దాఖలు చేశారు. వారి కుటుంబ సభ్యులు కూడా నాలుగు సెట్ల నామినేషన్‌ వేశారు. ఇండిపెండెంట్‌లు కూడా అధిక సంఖ్యలో దాఖలు చేశారు.అభివృద్ధికి అవకాశం కల్పించాలని పెదకూరపాడు నియోజకవర్గ ఎన్‌టిఎ కూటమి తరుపున టిడిపి అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌ కోరారు. గురువారం అమరావతి నుండి ర్యాలీగా బయలుదేరి పెదకూరపాడు ఆర్‌ఓ కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేశారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నాయి. ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతి అభివద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీకి అవకాశం కల్పించాలన్నారు. ఈ నామినేషన్‌ ర్యాలీలో పెదకూరపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కొమ్మాలపాటి శ్రీధర్‌, శాసనమండలి మాజీ చైర్మన్‌ షరీఫ్‌, వంగవీటి రాధా, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
మాచర్లలో 40 నామినేషన్లు
ప్రజాశక్తి – మాచర్ల :
మాచర్ల అసెంబ్లీ స్థానానికి గురువారం 15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు రిటర్నింగ్‌ అధికారి, పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. ఇప్పటి వరకు 24 మంది నుండి 40 సెట్ల నామినేషన్లు అందినట్లు చెప్పారు. వీటిపై శుక్రవారం ఉదయం 11 గంటలకు పరిశీలన ఉంటుందన్నారు. ఉపసంహరణకు ఈ నెల 29 వరకు సమయం ఉంటుందన్నారు. నామినేషన్ల సందర్భంగా వైసిపి, టిడిపి పార్టీలు నిబంధనలు ఉల్లంఘించాయని, డిజెలు పెట్టడం, పెద్ద జెండాలు వాడటం, టపాసులు కాల్చటం లాంటివి చేసినందున కేసులు నమోదు చేశామని తెలిపారు. రూ.29.47 లక్షల విలువైన మద్యం, నగదు, ఇతరాలను సీజ్‌ చేసినట్లు తెలిపారు. హోమ్‌ ఓటింగ్‌ కోసం 162 ఆర్జీలు అందాయని, తమ ప్రత్యేక సిబ్బంది వారి ఇళ్ల వద్దకు పోలింగ్‌ ఏజెంట్లతో కలిసి వెళ్లి ఓటు వేసేందుకు అవకాశం ఇస్తామని అన్నారు. 114 మంది సర్వీసు ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారని, వారికి ఆన్‌లైన్‌ ద్వారా ఈనెల 30వ తేదిలోపు ఓటు పంపిస్తామన్నారు. 542 మంది పిఓ, ఎపిఓలు, 858 మంది ఓపిఎస్‌లు, ఎంఐఓలు 74 మంది ఇతర సిబ్బందికి బిఎల్‌ఓలు 299 మంది, డ్రైవర్లు, వీడియో గ్రాఫర్ల్‌ తదితర మొత్తం 2 వేల మందికి ఫారమ్‌-12 ఇస్తామని, వీరందరికి జడ్‌పి బాలికల పాఠశాలలో వచ్చేనెల 5, 6, 7 తేదీల్లో ఓటు హక్కు కల్పిస్తామని ఆర్‌ఒ వివరించారు.

➡️