వరదల్లో భోజనాలు ఖర్చు 23 లక్షలంట..

Dec 8,2023 15:11 #Anantapuram District
food to floods victims

డిఈ చంద్రశేఖర్ ఆరు లక్షల బిల్లు పెట్టారట మిగతా సొమ్ము 17 లక్షల బిల్లు ఎవరు పెట్టారో తెలియదట

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : కాదేదీ కవితకు అనర్హము అని శ్రీశ్రీ మహాశయుడు చెప్పినట్లుగా అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో నిధులు స్వాహా చేయడానికి నడిమి వంకకు గత ఏడాది నవంబర్లో సంభవించిన వరదలు సువర్ణ అవకాశంగా లభించింది. వరద బాధితుల భోజనార్థం 23 లక్షలు రూపాయలు వ్యయం చేశారు. అయితే 15 రోజులుగా వరద నీటిలో బిక్కుబిక్కుమంటూ తిండి తిప్పలు లేకుండా నిద్రాహారాలు మాని ప్రజలు నానా అవస్థలు పడ్డారు. దీనితో వరద బాధితులను ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు మానవతావాదులు ప్రజలు తమ వంతుగా ఆహార పొట్లాలు వస్తు సామాగ్రి ఇతోదికంగా సహాయం చేశారు. గతంలో నేతల అవినీతి అక్రమాల కారణంగా నడిమి వంక ప్రొటెక్షన్ వాల్ నిర్మాణపు పనులు అర్ధాంతరంగా ఆగిపోయి ప్రజలు వరద బాధితులుగా మారాల్సి వచ్చింది. వరదల కారణంగా సర్వస్వం కోల్పోయి సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా చితికిపోయి రోడ్డున పడాల్సి వచ్చింది ముంపు నీటిలో స్థానిక ప్రజలు రకరకాల రుగ్మతలతో నెలల పాటు బాధలు పడ్డారు. వరద నీటితో సర్వస్వం కోల్పోయిన వారిని ఆదుకునే దిశగా అటు ప్రభుత్వంగానీ ఇటు మున్సిపల్ కార్పొరేషన్ కానీ ప్రజాప్రతినిధులు గాని చేయూతను అందించి ఆదుకున్న పాపాన పోలేదు అయితే వరద కష్టాలను సాకుగా చూపి సొమ్ము చేసుకునే ప్రబుద్ధులకు కొదవలేదు అన్న దానిని నిజం చేస్తూ కొందరు దానిని సొమ్ము చేసుకుని ప్రయత్నాలు చేపట్టారని స్థానిక కార్పొరేటర్లు ఆవేదన చెందుతున్నారు. వరద నీటిలో అష్ట కష్టాలు పడ్డ స్థానిక ప్రజలకు మేలు చేయాలన్న తలంపు లేకపోగా సొమ్ము చేసుకునే ప్రయత్నాలు మున్సిపల్ కార్పొరేషన్ లో చేపట్టారని వారు వాపోతున్నారు. ఈ విషయమై కమిషనర్ భాగ్యలక్ష్మిని ప్రశ్నించగా తనకి ఏమీ తెలియదని అదనపు కమిషనర్ రమణారెడ్డిని అడగాలని సూచించినట్లు స్థానిక కార్పొరేటర్ శ్రీనివాసులు తెలిపారు. దీనిపై అదనపు కమీషనర్ రమణారెడ్డిని వాకబు చేయగా తనకేమీ తెలియదని ఇంజనీరింగ్ సెక్షన్ వారు భోజన ఏర్పాట్లు చేశారని సెలవిచ్చారు. సరేనని ఇంజనీరింగ్ సెక్షన్ ను డి ఈ చంద్రశేఖర్ను ప్రశ్నించగా తాను కేవలం 6 లక్షల రూపాయలకు మాత్రమే బిల్లు పెట్టానని తెలిపారని స్థానిక కార్పొరేటర్ శ్రీనివాసులు తెలిపారు మిగతా బిల్లు అసిస్టెంట్ ఇంజనీర్ సాయి పెట్టి ఉండవచ్చునని అధికారులు తెలిపారని కార్పొరేటర్ శ్రీనివాసులు ఆవేదన వెలుబుచ్చారు. కొంపగోడు కోల్పోయి తిండి తిప్పలు లేక నిద్రాహారాలు లేక 15 రోజులపాటు వరద నీటిలో నానా అగచాట్లు పడిన తమకు సహాయం ఎవ్వరూ చేయలేదని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు మానవతావాదులు అందించిన ఆహార పొట్లాలు తాగునీటి పొట్లాలతో తాము ప్రాణాలు కాపాడుకుని కాలం వెళ్లబుచ్చామని ఆయన తెలిపారు చచ్చిన శవాలపై పేలాలు ఏరుకున్నట్లుగా వరద నీటిలో అష్ట కష్టాలు పడ్డ తమను ఆదుకోకపోగా తమ ప్రజలకు భోజన వసతి కల్పించామని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పేర్కొంటూ 23 లక్షల రూపాయలకు బిల్లులు పెట్టారంటే వారిని ఏమనాలో అర్థం కావడం లేదు అంటున్నారు. ఇంత అవినీతి జరుగుతుంటే కమీషనర్ మాత్రం తనకి ఏమీ తెలియదని పేర్కొనటం దారుణమన్నారు కంచె చేను మేసే విధంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు యదేచ్చగా అక్రమాలకు పాల్పడుతుంటే వాటిని నిరోధించాల్సిన కమిషన్ గాని అదనపు కమిషనర్ గాని ఇంజనీరింగ్ అధికారులు కానీ ఎవరు ఎవరికివారు తమకేమీ తెలియదని పేర్కొనటం చూస్తే సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తోందని ఆయన వాపోయారు. అయితే భోజనాల ఖర్చు పేరుతో 23 లక్షల రూపాయలు ఖర్చు చేశారంటే బయటకు తెలియని బిల్లులు మరెన్ని లక్షల రూపాయలు దిగమింగారో పరమాత్ముడికి తెలియాలని వారు పేర్కొంటున్నారు.

➡️