వ్యవసాయం కోసం..

Jun 17,2024 23:39

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఖరీఫ్‌ ప్రారంభం నేపథ్యంలో గతంలో నష్టాలు మిగిల్చిన అప్పులు.. ఈ ఏడాది పెట్టుబడి కోసం అవసమైన సొమ్ములను లెక్కలేసుకుంటూ రైతులు గాబరా పడుతున్నారు. తమది రైతు ప్రభుత్వమని అన్ని ప్రభుత్వాలు చెబుతున్నా ఆచరణలో రైతులకు మొండిచేయే మిగిలుతోంది. ప్రభుత్వాల విధానాల కారణంగా పెరుగుతున్న ఖర్చులు ఒకవైపు, మద్దతు ధరలు పెంచని తీరు మరోవైపు రైతులను ప్రతిఏడూ నష్టాల్లోనే నడిపిస్తున్నాయి. దీనికి తోడు ప్రకృతి విపత్తులు, చీడపీడలు మరింతగా కుంగదీస్తున్నాయి. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు సాకులతో కాలం వెళ్లబుచ్చుతుండగా రైతులు వ్యవసాయ కాడిని మోయలేక మోయాల్సిన దుస్థితిలో నెట్టబడ్డారు. పల్నాడు జిల్లాలో ఈ ఏడాది 8,33,625 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అంచనా. నీటి లభ్యత సరిగా ఉంటే 1,93,750 ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా. ఈ నేపథ్యంలో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే నారుమడులు సిద్ధం చేస్తున్నారు. నీటి లభ్యత ఆశించిన మేర లభిస్తే వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి తగ్గట్లు వరి విత్తనాలు, ఎరువులు సరఫరా అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశామని అధికారులు ప్రకటించారు.వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగడం, చీడపీడల ఉధృతి నేపథ్యంలో ఎరువుల వాడకమూ అధికం కావడంతో ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఎకరా వరి సాగుకు సుమారు రూ.40 వేల వరకు ఖర్చవుతోంది. కౌల్దార్లయితే కౌలు ఖర్చులు అదనం. ఎకరాకు దిగుబడి సగటున 30-35 బస్తాల వరకు ఉంటుంది. ప్రస్తుతం కొత్త ధాన్యం రకాన్ని బట్టి రూ.1800-2200 ధర పలుకుతోంది. పాత ధాన్యం ధర పరిశీలిస్తే జెజెలు, బిపిటి రకం రూ.2800 వరకు ఉంది. ఈ లెక్కన ఆరు నెలలు కష్టించిన సొంత పొలం ఉన్న రైతుకు అన్నీ అనుకూలిస్తే మిగిలే ఆదాయం రూ.10 వేలు మాత్రమే. కౌల్దార్లకైతే ఇంకా నష్టం. సాగులో దాదాపు 70 శాతానికిపైగా కౌలురైతులే ఉన్నారు. నిత్యం నష్టాలతో వ్యవసాయం చేసే వీరికి ప్రభుత్వాలు దన్నుగా నిలవాలని, పెట్టుబడి సాయం, రాయితీపై వ్యవసాయ ఉపకరణాలు ఇవ్వాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.
సరైన మద్దతు ధరలుంటేనే మిగులు
తిరువీధుల వెంకయ్య, కౌలురైతు, అన్నవరం, రొంపిచర్ల, మండలం.
మా కష్ట పోను మిగులు కొంతైనా ఉండాలంటే పంటలకు సరైన మద్దతు ధర ఉండాలి. కోత సమయంలో వాతావరణం అనుకూలంగా ఉంటే రైతుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొనుగోలు చేసే దళారులు కానీ, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు కానీ నాణ్యత బాగా లేదని ఇంకా ఏమైనా ఆంక్షలు విధిస్తే అప్పులపాలు కావడమే.
కష్టానికి, రాబడికి పొంతన లేదు
కందుకూరి మోషే, పెట్లూరివారిపాలెం, నరసరావుపేట మండలం.
రైతులు పడుతున్న కష్టానికి, వస్తున్న లాభానికి పొంతనే లేదు.6 నెలల పాటు గొడ్డులా చాకిరీ చేస్తున్నా చివరకు అప్పుల పాలవుతున్నాం. మాకు పూట గడవాలన్నా, పిల్లల చదువులు ఇతర కుటుంబ ఖర్చులకు కావాలన్నా అప్పులను ఆశ్రయించక తప్పడం లేదు. ఆకాల వర్షాలకు నష్టపోయిన సమయంలో పంటలకు పరిహారం చెల్లించి ఆదుకోవాలి. బీమా సౌకర్యం సైతం కల్పించి పంటలను సకాలంలో ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేయాలి.
నకిలీ మందులతో నష్టపోయా
మందపాటి వెంకటేశ్వర్లు, రైతు, పరగటిచర్ల గ్రామం, రొంపిచర్ల మండలం.
గతేడాది 12 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తే నకిలీ పురుగు మందులు బారిన పడి రూ.15 లక్షల వరకూ నష్టపోయా. బిల్లులు తీసుకొని ప్రజా ప్రతినిధులు, పోలీసు స్టేషన్ల చుట్టూ తిరిగినా న్యాయం చేయలేదు. చివరకు స్పందన కార్యక్రమంలో కూడా పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న వారులేరు. అధికారులకు సంబంధిత కంపెనీ యజమాని మామూళ్లు ఇచ్చి ఉంటారని అనుమానంగా ఉంది.

➡️