సామాన్య కార్యకర్త నుంచి సిపిఎం అభ్యర్థిగా

Apr 9,2024 21:04

 ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం  : రానున్న సాధారణ ఎన్నికల్లో కురుపాం నియోజకవర్గం నుంచి సిపిఎం అభ్యర్థిగా పోటీలో నిలుస్తున్న మండంగి రమణ ఆ పార్టీలో సాధారణ కార్యకర్త నుంచి ఎదిగారు. గిరిజన సంఘం నాయకుడిగా అనేక గిరిజన సమస్యల పై జరిగిన పోరాటాల్లో పాల్గొన్నారు. రమణ 1994లో మొదటిసారిగా సిపిఎం పార్టీలో చేరారు. అప్పటి సిపిఎం నాయకులు కీర్తిశేషులు పత్తిక హరిచంద్రుడు గిరిజనుల పక్షాన చేస్తున్న ఉద్యమాలు , పోరాటాలకు రమణ ఆకర్షితుడై సిపిఎంలో చేరారు. హరిశ్చంద్రుడు సేవా కార్యక్రమాల స్ఫూర్తితో సిపిఎంలో చేరి పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. మంచి మనిషిగా, ప్రజా సేవకుడుగా మన్యం ప్రాంతంలో రమణ గుర్తింపు తెచ్చుకున్నారు. గిరిజనులకు కష్టమొస్తే పగలైనా రాత్రయినా అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడంలో ముందుంటున్నారు. గిరిజనుల హక్కులు, చట్టాలు, పోడు పట్టాలు, గిరిజన యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన, గ్రామంలో తాగునీరు, రోడ్లు, వైద్యం వంటి మౌలిక వసతుల కల్పన కోసం సిపిఎం, గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసి పరిష్కారానికి కృషి చేశారు. గిరిజనులు పండించే అటవీ ఫల సాయాలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఎన్నోసార్లు జిసిసి, ఐటిడిఎ కార్యాలయం ఎదుట గిరిజనులతో కలిసి పోరాటాలు చేసి వారికి మద్దతుగా నిలిచారు.సర్పంచి, ఎంపిటిసిగా కొనసాగుతూ…గిరిజనులు, దళితులు, బిసిలు, ఉద్యోగులు, వ్యాపారుల సహకారంతో మండంగి రమణ రెండుసార్లు సర్పంచ్‌గా, మరో రెండు సార్లు ఎంపిటిసిగా గెలుపొందుతూ వస్తున్నారు. 2004లో మొదటిసారిగా ఎల్విన్‌ పేట పంచాయతీ సర్పంచ్‌ గా ఎన్నికయ్యారు. రెండోసారి 2009లో ఎంపిటిసిగా గెలుపొందారు. మళ్లీ 2014లో ఎల్విన్‌ పేట సర్పంచిగా విజయం సాధించారు. 2021లో జరిగిన ఎన్నికల్లో రిజర్వేషన్‌ మార్పులు కారణంగా చెముడు గూడ ఎంపిటిసిగా పోటీ చేసి గెలుపొందారు. రేషన్‌ కార్డులు, పింఛన్లు, గ్రామాల్లో బోర్లు, సిసి రోడ్లు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేలా కృషి చేస్తూ ఉత్తమ ప్రజా ప్రతినిధిగా గిరిజన గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. తాజాగా సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న రమణ ఇప్పటికే తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

➡️