ఓట్ల రాజకీయం నుండి పొలం గట్లపైకి

May 26,2024 23:44

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : నిన్న మొన్నటి వరకు ఎన్నికల హడావుడిలో ఉన్న రైతులు తాజాగా కురుస్తున్న అదపాదడప వర్షాలతో సాగుకు సన్నద్ధం అవుతున్నారు. వేసవి దుక్కులు పనులు ఇప్పటికే మొదలుపెట్టారు. మరోవైపు వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఖరీఫ్‌ సాగు ప్రణాళికలను సిద్ధం చేశారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సమకూర్చే పనిలో నిమగమయ్యారు. ఎన్నికల నేపథ్యంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో? తమకు సాగు పెట్టుబడి ఎప్పుడు అందుతుందో? అని పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఓట్ల రాజకీయాల ఉత్సుకతకు కాస్తంత విరామమిచ్చి పొలం గట్లపై అడుగులేస్తున్నారు.పల్నాడు జిల్లాలో సాగు భూమి 8 లక్షల 75 వేల ఎకరాలు ఉండగా ఇందులో 8 లక్షల 32 వేల 500 ఎకరాలు సాగవుతున్నట్లు అధికారుల అంచనా. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 34723 మెట్రిక్‌ టన్నుల ఎరువులు సిద్ధం చేస్తున్నామని, కొద్దిరోజుల్లో పూర్తి స్థాయిలో రైతుభరోసా కేంద్రంలో అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు.వరి సాగులో పెట్టుబడులు పెరగడం, ధాన్యం ధరలు పెరగక పోవడం, సాగునీటి ఇబ్బందులు తదితర కారణాలతో పల్నాడు జిల్లాలో వరి సాగు విస్తీర్ణం తగ్గుతోంది. వరి రైతులు 10 సెంట్లలో వరి నారుమడి సిద్ధం చేసుకోవాలని, నారు వేసే ముందు నీటిలో తేలియాడే తాలు గింజలు తొలగించాలని, 10 సెంట్ల నారుమడికి 500 కిలోల పశువుల ఎరువు ఎకరానికి సాధారణ పద్ధతిలో 30 కిలోల వరి విత్తనాలను 5 లీటర్ల బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తే తెగుళ్ల బెడద తగ్గి పెట్టుబడులు తగ్గుతాయని అధికారులు సూచిస్తున్నారు.మొక్కజొన్న, పత్తి, మిర్చి, ఇతర పంటలకు సంబంధించి జిల్లాలో మధ్యకాల రకాలు సాగు చేసుకోవాలని, నేల స్వభావాన్ని బట్టి వ్యవసాయ శాఖ అధికారుల సలహా మేరకు ఆయా పంటలలో ఏ రకం విత్తనం బాగుంటుందని చెప్తే ఆ విధంగా రైతులు ముందుకు వెళ్లాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. భూసారంతో పాటు భూమిలో సూక్ష్మ పోషకాలను పెంచేందుకు పచ్చిరొట్ట పంటలతో పాటు నవధాన్యాలు సాగుచేయాలంటున్నారు. పచ్చిరొట్ట, నవధాన్యాల సాగుచేయడం వల్ల భూసారం పెరుగుతుందని, నత్రజని ఎరువులు పెద్దగా అవసరం ఉండదని అంటున్నారు.

విత్తనాలు, ఎరువుల కొరతలేదు
ఐ.మురళి, పల్నాడు జిల్లా వ్యవసాయ అధికారి.
ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నేపథ్యంలో పంటల సాగుకు సన్నద్ధమవుతున్నాం. విత్తనాలు, ఎరువుల కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు సరఫరా ప్రారంభమైంది. మరికొద్ది రోజులలో రైతుభరోసా కేంద్రాల్లో పూర్తిస్థాయిలో విత్తనాలు, ఎరువులు నిల్వ చేసి అవసరం మేరకు రైతులకు పంపిణీ చేస్తాం. ఎరువులు, విత్తనాలకు కొరత లేదు.
రైతుల అవసరాలు క్షేత్ర స్థాయిలో తెలుసుకోవాలి
కె.రామారావు, కౌలురైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు.
మండల స్థాయిలో రైతులతో సమావేశం ఏర్పాటు చేసి రైతుల అవసరాలను అధికారులు తెలుసుకోవాలి. రైతుల నుండి అభిప్రాయాలు సేకరించి సలహాలు సూచనలు అందజేసి చైతన్యం నింపడం ద్వారా సాగు పెరిగే అవకాశం ఉంటుంది. విత్తన కోనుగోలులో రైతులు మోసపోకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలను రాయితీపై అందజేయాలి. కౌలు రైతులను త్వరగా గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. గతేడాది గుర్తింపు కార్డు కలిగిన కౌలురైతులకు పచ్చిరొట్ట విత్తనాలను రాయితీపై ఇవ్వాలి. మండలానికి 500 టన్నుల పచ్చిరొట్ట విత్తనాలు అనే నిబంధన ఎత్తివేసి అవసరం మేరకు పంపిణీ చేయాలి. పెట్టుబడి సాయం, ఇతర రాయితీలు కౌలురైతులకు దక్కేలా చూడాలి.

➡️