ఘనంగా ఉగాది వేడుకలు

Apr 9,2024 20:56

ప్రజాశక్తి- బొబ్బిలి:  పట్టణంలోని ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజచెరువు వలసలో చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తెలుగు సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఉగాది వేడుకలు నిర్వహించారు. రైతులు పశువుల పేడతో తయారు చేసిన ఎరువును పంట పొలాల్లో వేసి పంటలు బాగా పండాలని పూజలు చేశారు. మెరకముడిదాం : మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. బైరిపురంలో రామమందిరం వద్ద జరిగిన పంచాంగ శ్రవణంలో సర్పంచ్‌ పప్పల విజయకుమారి, వైస్‌ సర్పంచ్‌ పప్పల క్రిష్ణ మూర్తి, వైసిపి నాయకులు పప్పల గ్రహణేశ్వరరావు, మాజీ సర్పంచ్‌ కెంగువ ధనంజయ, కెంగువ నరసింహ మూర్తి, గ్రామ ప్రజలు, యూత్‌ సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.వేపాడ: మండలంలో పలు గ్రామాల్లో రామాలయాల వద్ద గ్రామ పెద్దలు అందరూ కూర్చొని ఉగాది పర్వదినాన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొని ఈ ఏడాది జరగబోయే మంచి చెడులు గూర్చి రాసి ఫలాలు గూర్చి, పేరు బలాలు ఫలితాలను పురోహితులన అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. నెల్లిమర్ల: ఉగాది సందర్భంగా జరజాపుపేటలో పెద మద్దిల, చిన మద్దిల కుటుంబాల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పెద్దలు, యువత సంప్రదాయ పద్ధతిలో దుస్తులు ధరించి రాబోయే రోజుల్లో గ్రామాభివృద్ధి, వ్యవసాయ సంబంధించిన పనులపై చర్చించి ఉగాది ప్రసాదం స్వీకరించి అందరికి పంపిణీ చేశారు. కాగా రాబోయే రోజుల్లో ఇదే సంప్రదాయాన్ని పాటించి గ్రామాన్ని ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. గరికిపేట గ్రామంలో మాజీ సర్పంచ్‌ చింతపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు.డెంకాడ: ఉగాది సందర్భంగా స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష అలంకరణలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి మంగళవారం దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు శ్రీమాన్‌ కాండూరు జగన్నాథచార్య స్వామి, శ్రీ భూసమైతుడైన శ్రీనివాసుడికి ఈ సంవత్సరమంతా శుభంగా సాగాలని, స్వామివారి అనుగ్రహం ద్వార అంతా శుభం జరగాలని అష్టోత్తర సహస్రనామార్చన పూజలు చేశారు.

➡️