వైసిపి నేత పెమ్మసానిపై ఫిర్యాదు

Mar 21,2024 13:34 #Guntur District

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : వైసీపీ దాడులపై గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీకి టిడిపి, జనసేన, బిజెపి ఫిర్యాదుచేశాయి.  ‘మా అభ్యర్థిపై దాడి చేసి మాపైనే కేసులు పెడుతున్నారు. దాడులు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలి. అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోతే టిడిపి సొంత బలంతోనే ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది.’ అని టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పత్తిపాడు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి బూర్ల రామాంజనేయులుపై బుధవారం జరిగిన వైసీపీ నాయకుల దాడిని ఖండిస్తూ డాక్టర్ పెమ్మసానితో పాటు పలువురు టీడీపీ, బిజెపి, జనసేన నాయకులు ఎస్పీ తుషార్ డూడీని ఆయన కార్యాలయంలో గురువారం కలిసి ఫిర్యాదు చేశారు. ఎస్పీని కలిసి సమస్యను వివరించిన తర్వాత ఎన్నికల నియమావళిని సంపూర్ణంగా అమలు చేయాలని కోరారు. అనంతరం విలేకరులతో పెమ్మసాని మాట్లాడుతూ ఎస్పీ, కలెక్టర్ కలిసి ఎన్నికల నిబంధనలపై స్పష్టమైన వైఖరిని అవలంబించాలని కోరారు. అధికార పార్టీ నాయకులు ఇదే తీరున దాడులకు తెగబడితే చూస్తూ ఊరుకోబోమని, తమదైన పద్ధతిలో సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని వైసిపి నాయకులను ఆయన హెచ్చరించారు. వైసీపీ నాయకులు టిడిపి నేత వాహనంపై దాడి చేసిన ఆధారాలు చూపిస్తున్నా సరే అధికారులు స్పందించకపోవడం ఏంటని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు.

రాజ్యాంగ విరుద్ధం : బూర్ల రామాంజనేయులు 

అధికార పార్టీ నాయకులు వైసిపి కార్యాలయంలో సమావేశాలు పెట్టి మరీ.డబ్బులు, బహుమతులు ఇచ్చే విధంగా సిద్ధపడుతున్నారని, ఎన్నికలను తప్పుదోవ పట్టిస్తున్నారని రామాంజనేయులు ఆరోపించారు. వైసీపీ నాయకులు ఏం చేసినా అధికారులు పట్టించుకోవడంలేదని, తమపై దాడులకు తెగబడి వాహనాలు ధ్వంసం చేసిన నాయకుల పై చర్యలు తీసుకోకపోవడం విడ్డూరమని అన్నారు. చివరకు పోలీస్ స్టేషన్లకు వెళ్లినా తమకు రక్షణ లేని విధంగా పోలీసుల ముందరే వైసీపీ నాయకులు దాడులకు తెగబడ్డారని ఆయన స్పష్టం చేశారు. దాడులకు పాల్పడ్డ వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో తాము టీడీపీ అదిష్టానం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది అని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, తాడికొండ నియోజకవర్గం టిడిపి అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి, గుంటూరు తూర్పు నియోజకవర్గం టిడిపి అభ్యర్థి మహమ్మద్ నసీర్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, బిజెపి జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

➡️