అసెంబ్లీ సమీపంలో పారిశుధ్య కార్మికుల ధర్నా

Feb 3,2024 11:45 #ap assembly, #Municipal worker
municipal workers protest near assembly

ప్రజాశక్తి – తుళ్లూరు : అసెంబ్లీలో విధులు నిర్వర్తించే పారిశుధ్య కార్మికులు శుక్రవారం ధర్నాకు దిగారు. సిఐటియు రాజధాని డివిజన్ కమిటి ఆధ్వర్యంలో అసెంబ్లీ దగ్గర నుంచి మల్కాపురం జంక్షన్ వరకు ప్రదర్శన జరిపారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్బంగా సిఐటియు రాజధాని డివిజన్ కమిటి కార్యదర్శి ఎం భాగ్యరాజు మాట్లాడుతూ, అసెంబ్లీ ప్రారంభం దగ్గర నుంచి ఇప్పటివరకు కార్మికుల నిర్వహణ ఏజెన్సీకి చెందిన నలుగురు కాంట్రాక్టర్ లు మారారని చెప్పారు. కాంట్రాక్టర్ లు మారినప్పుడల్లా కార్మికులకు అనేక ఇబ్బందులు ఎదురవు తున్నాయని చెప్పారు. కాంట్రాక్టర్ లు మారారని చెబుతూ కార్మికులకు నెలల తరబడి పీఫ్, ఈ ఎస్ ఐ, జీతాలను యెగ్గొట్టడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు. గత ఎన్నికలకు ముందు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులను ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ లో కి తీసుకుంటామని నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పారని, అధికారంలోకి వచ్చాక చెప్పిన మాటను మర్చిపోయారని అన్నారు. అసెంబ్లీ లో పనిచేసే పారిశుధ్య కార్మికులు సి ఆర్ డి ఎ పరిధిలో పనిచేస్తున్నందున సి ఆర్ డి ఎ కమిషనర్, పురపాలక శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ ను కలిసి సమస్యల పై వినతిపత్రం ఇవ్వడం జరిగిందని భాగ్య రాజు చెప్పారు. గత సెప్టెంబర్ లో పేర్ని నాని తో కలిసి సిఎం కు కూడా విన్నవించామని చెప్పారు. ఐదు నెలలు గడిచినా ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలూ లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటి కైన స్పందించి పారిశుధ్య కార్మికులను ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ లోకి తీసుకోవాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.

➡️