మాతా, శిశు ఆరోగ్య వివరాలు పక్కగా నమోదు చేయాలి

Apr 19,2024 22:33

 ప్రజాశక్తి – సీతానగరం : మాతా, శిశు ఆరోగ్య వివరాలు పక్కగా నమోదు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ బి.జగన్నాథరావు ఆదేశించారు. సీతానగరం, బలిజిపేట మండలాలకు చెందిన పిహెచ్‌సిల వైద్యాధికారులు, సిబ్బందికి పలు ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షా సమావేశం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో జగన్నాథరావు మాట్లాడుతూ గర్భిణులకు చేపడుతున్న ఆరోగ్య తనిఖీలు, వైద్య పరీక్షల వివరాలు మాతాశిశు సంరక్షణ కార్డులో పూర్తి స్థాయిలో నమోదు చేసి సంబంధిత పోర్టల్‌లో ఆన్లైన్‌ చేయాలని, తద్వారా గర్భిణుల ఆరోగ్యాన్ని నిశితంగా పర్యవేక్షించవచ్చునని అన్నారు. అసాధారణంగా గుర్తించిన పరీక్షల నివేదికలను బట్టి హైరిస్క్‌ గర్భిణులను గుర్తించి, ప్రసవం పూర్తయ్యేంత వరకు సరైన వైద్యమందజేస్తూ, పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. పిహెచ్‌సిల్లో సాధారణ కాన్పులు జరిగేలా చూడాలన్నారు. కాన్పు తర్వాత శిశు ఆరోగ్య పర్యవేక్షణపై దృష్టి సారించాలన్నారు. బిడ్డ బరువు, టీకాలు, శ్వాస ప్రక్రియ తదితర వాటిపై నవజాత శిశువుల్లో పర్యవేక్షణ చేయాలన్నారు. వివరాలు పోర్టల్‌లో, హెచ్‌బిఎన్‌సిలో ఆన్లైన్‌ నమోదు చేయాలన్నారు. గర్భిణీలు నమోదు మొదటి త్రైమాసికంలోనే జరగాలని, తద్వారా పై వివరించిన ఆరోగ్య పర్యవేక్షణ పూర్తి స్థాయిలో అందజేయవచ్చన్నారు. ప్రిజం-10 పక్కగా అమలు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. గర్భిణీలు, బాలింతలు, శిశువులు, కిశోర బాలికల్లో రక్తహీనతగా ఉన్న వారిని గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. వడదెబ్బ, డీ హైడ్రేషన్‌ ప్రజల్లో అవగాహన కల్పించి, జాగ్రత్తలు తెలియజేయాలన్నారు. ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. జ్వరాలు గుర్తిస్తే వెంటనే నిర్ధారణ పరీక్షలు జరపాలన్నారు. దీర్ఘకాలిక రోగులు, టిబి వ్యాధిగ్రస్తుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలన్నారు. ఎఫ్‌డిపి, ఆరోగ్య సురక్ష, కంటి వెలుగు కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి (డిఎంఒ) డాక్టర్‌ టి.జగన్‌ మోహనరావు, ఎఫ్‌డిపి ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ ఎం.వినోద్‌, ఎపిడిమియాలజిస్ట్‌ డాక్టర్‌ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️