పేదల ఇంటికే సంక్షేమ పథకాలు

Apr 10,2024 22:15

ప్రజాశక్తి-సాలూరు: వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మళ్ళీ సిఎం అయితేనే పేదల ఇంటికి సంక్షేమ పథకాలు అందుతాయని డిప్యూటీ సీఎం రాజన్నదొర అన్నారు. టిడిపి గెలిస్తే పథకాలు అందవని అఆన్నరు. బుధవారం మండలం లోని గంగన్నదొరవలస సమీపంలోని తోటలో పార్టీ మండల అధ్యక్షుడు సువ్వాడ భరత్‌ శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన మండల సమావేశంలో రాజన్నదొర మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో వైసిపిని మళ్ళీ అధికారంలోకి తేవాలని కోరారు. టిడిటి అధికారంలోకి వస్తే పేదలంతా సంక్షేమ పథకాలను కొనుక్కోవాల్సి వస్తుందని చెప్పారు. గతంలో టిడిపి ప్రభుత్వం హయాంలో జన్మభూమి కమిటీలకు ముడుపులు చెల్లిస్తే గాని సంక్షేమ పథకాలు అందే పరిస్థితి లేదన్నారు. టిడిపి కార్యకర్తలు, అనుచరులకే సంక్షేమ పథకాలు అందాయన్నారు. ఇటీవల పింఛనును లబ్దిదారులకు ఇంటికి వెళ్లి పంపిణీ చేయకుండా టిడిపి, జనసేన పార్టీలు కుట్ర చేశాయని ఆరోపించారు. టిడిపి, జనసేన, బిజెపి ల కూటమిని నమ్మితే నట్టేట మునిగిపోతారని అన్నారు. తన నియోజకవర్గంలో 16 వందల కోట్ల సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేసినట్లు తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వంతెనల నిర్మాణం చేపట్టామని చెప్పారు. కులం పేరుతో రాజకీయం చేస్తే ఇసికి ఫిర్యాదుటిడిపి అభ్యర్థి సంధ్యారాణి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎస్‌టిల వద్దకు వెళ్ళి తాను ఎస్‌టినని, బిసిల వద్దకు వెళ్లి తాను బిసి నని చెప్పుకుంటున్నారని రాజన్నదొర ఆరోపించారు. ఆధారాలు లభిస్తే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.అందరికీ అందుబాటులో ఉంటా.. తనూజారాణి మాజీ ఎంపీ కొత్తపల్లి గీతలా తాను హైదరాబాద్‌ లో ఉండనని, అందరికీ అందుబాటులో ఉంటానని అరకు ఎంపి అభ్యర్థి డాక్టర్‌ తనూజా రాణి అన్నారు. తనకు గిరిజన సమస్యలపై అవగాహన వుందని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు దండి శ్రీనివాసరావు, డోల బాబ్జీ, మావుడి వాసు నాయుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌ పర్సన్‌ రెడ్డి పద్మావతి మాట్లాడారు. మక్కువ మండలం అధ్యక్షుడు మావుడి రంగు నాయుడు,పట్టణ అధ్యక్షుడు వంగపండు అప్పల నాయుడు, అర్బన్‌ బ్యాంక్‌ అధ్యక్షుడు జర్జాపు ఈశ్వరరావు, మెంటాడ మండల నాయకులు ఈశ్వరరావు పాల్గొన్నారు.

➡️