ఏ సమస్య వచ్చినా నేనున్నాను : బొత్స

Apr 3,2024 21:34

ప్రజాశక్తి – జామి  : చిన్న చిన్న పొరపచ్చాలు వీడి కలిసికట్టుగా పనిచేసి వైసిపి ఎమ్మెల్యేలు, ఎంపి అభ్యర్థులను గెలిపించుకోవాలని మంత్రి బొత్స సత్యన్నారాయణ పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని కుమరాం గ్రామంలో ఆ పార్టీ మండల కన్వీనర్‌ జి. రవికుమార్‌ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన మంత్రి కేడర్‌కు పలు సూచనలు చేశారు. గత పాతికేళ్ళుగా ఎస్‌. కోట నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలకు అండగా ఉన్నామని, ఇప్పటి నుంచి మరింత బాధ్యతగా ఉండి, సేవ చేస్తానని హామీ ఇచ్చారు. వెళ్లిపోయిన వారిని పట్టించుకోవద్దని అన్నారు. మీమండలం, మీ గ్రామాల్లో మీకున్న గౌరవానికి, విలువకు ఏమాత్రం డోకా లేకుండా చూసుకునే బాధ్యత నాదేనని, ఇప్పటి వరకు మీతో ఉన్న అనుభందం కన్నా మరింత అనుభందం పెరిగిందని అన్నారు. ఎస్‌.కోటలో ఎమ్మెల్యే గెలిస్తే ఎంపి కూడా గెలుస్తారని, ఇది చరిత్ర చెబుతోందని గుర్తు చేసారు. మీకు ఏకష్టం వచ్చినా స్థానిక ఎమ్మెల్యే, ఎంపితోపాటు తానుకూడా ఉన్నానని భరోసా ఇచ్చారు. భీమసింగి చక్కెర కర్మాగారం స్థానంలో మరో పరిశ్రమను ఏర్పాటు చేస్తామని, వందలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కలిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్‌.కోట ఎమ్మెల్యే కడుబండి మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ది జరిగిందంటే అది తమ హాయాంలోనేనని గుర్తించాలన్నారు. సమావేశంలో ఎస్‌కోట పరిశీలకులు తైనాల విజరుకుమార్‌, గిరిజన కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ శోభాస్వాతీరాణి, జెడ్‌పిటిసి గొర్లె సరయు, సీనియర్‌ నాయకులు పి.సంజీవి, చలుమూరు సత్యారావు, అల్లు పద్మ, గేదెల వెంకటరావు,ఎన్నింటి విజయలక్ష్మి, మండల యువజన విభాగం అధ్యక్షుడు పిన్నింటి రవి తదితరులు పాల్గొన్నారు.

➡️