ఇండియా వేదికదే విజయం

May 2,2024 23:08

జొన్నా శివశంకరరావకు స్వాగతం పలికి మద్దతు తెలుపుతున్న ప్రజలు
ప్రజాశక్తి-తాడేపల్లి :
ఈ ఎన్నికల్లో ఇండియా వేదికదే విజయమని, బిజెపి ఓటమి ఖాయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఇండియా వేదిక బలపరిచిన మంగళగిరి అసెంబ్లీ నియోకవర్గ సిపిఎం అభ్యర్థి జొన్నా శివశంకరరావు, గుంటూరు పార్లమెంట్‌ సిపిఐ అభ్యర్థి జంగాల అజరుకుమార్‌ విజయాన్ని కాంక్షిస్తూ గురువారం ఉండవల్లి సెంటర్‌ నుంచి కెఎల్‌ రావుకాలనీ, సీతానగరం, ప్రభుత్వాసుపత్రి ప్రాంతాల్లో రోడ్‌ షో నిర్వహించారు. ఉండవల్లి సెంటర్‌లో సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అధ్యక్షతన జరిగిన సభలో శ్రీనివాసరావు మాట్లాడారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు బిజెపి తెస్తే దానికి రాష్ట్రంలోని టిడిపి, వైసిపి, జనసేన మద్దతు ఇస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాలకుల వద్ద తాకట్టు పెడుతున్న ఆ మూడు పార్టీలనూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వైసిపి, టిడిపి, జనసేనకు ఓటేస్తే బిజెపికి వేసినట్టేనన్నారు. బిజెపితో అంటకాగిన ఆ పార్టీలు రాష్ట్రానికి ఏం సాధించాయని నిలదీశారు. తాము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని లోకేష్‌ చెబుతున్నారని, గత టిడిపి పాలనలో రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని అన్నారు. రాజధాని లేని రాష్ట్రాన్ని చేసిన పాపం వైసిపి, టిడిపిలదేనని విమర్శించారు. చంద్రబాబు అమరావతి పేరుతో గ్రాఫిక్స్‌ చూపించి మోసం చేశారన్నారు. ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో 33,500 ఎకరాలు రైతుల నుంచి తీసుకుని వారికి కూడా చుక్కలు చూపించారన్నారు. జగన్‌ మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారని, విశాఖలో రూ.500 కోట్లతో భవనం కట్టుకున్నారని, అంతేగాని ప్రజలకు చేసింది శూన్యమని విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్‌ ఎత్తివేస్తామని ప్రకటించిన బిజెపికి వైసిపి, జనసేన, టిడిపి ఎందుకు మద్దతు ఇస్తున్నాయో చెప్పాలన్నారు. గత పదేళ్లుగా రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టిన పాపం టిడిపి, వైసిపిదేనని విమర్శించారు. ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు వి.సూర్యారావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నేతాజీ, సిపిఎం రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం.రవి, నాయకులు వి.వెంకటేశ్వరరావు, రూరల్‌, పట్టణ కార్యదర్శులు డి.వెంకటరెడ్డి, బి.వెంకటేశ్వర్లు, నాయకులు కె.శివరామకృష్ణయ్య, డి.శ్రీనివాసకుమారి, కె.కరుణాకరరావు, వి.దుర్గారావు, డివి భాస్కరరెడ్డి, ఎం.శ్రీనివాసరెడ్డి, వి.సామ్యేలు, కె.మేరి, సిపిఐ నాయకులు ఎం.డాంగే, టి.వెంకటయ్య, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

హోరెత్తిన ప్రచారం
సిపిఎం తాడేపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఉండవల్లి సెంటర్‌ సచివాలయం నుంచి ప్రారంభమైన రోడ్‌షో ఆద్యంతం ప్రజల మద్దతుతో ముందుకు సాగింది. తీన్‌మార్‌ డప్పులతో మోత మోగించారు. కెఎల్‌రావు కాలనీ, హోసన్న మందిరం, ప్రకాశం బ్యారేజీ మీదుగా సీతానగరంలో పర్యటన సాగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో అభ్యర్థి జొన్నా శివశంకరరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కాంగ్రెస్‌ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు డి.సామ్యేలు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అభ్యర్థి వద్దకు అనేక మంది వచ్చి మద్దతు తెలిపారు. హారతులు పట్టారు. ఆంజనేయస్వామి గుడి వద్ద వాహనాలు వెళ్లలేని పరిస్థితిలో అభ్యర్థితో పాటు శ్రీనివాసరావు కూడా వ్యాన్‌ దిగి ప్రజల వద్దకు వెళ్లగా వారికి పూలవానతో స్వాగతం పలికారు.

➡️