ఉపాధి హామీ కూలీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి

కూలీలతో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌.రాము

ప్రజాశక్తి- అచ్యుతాపురం

ఉపాధి హామీ కూలీలకు పని ప్రదేశంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌ రాము డిమాండ్‌ చేశారు. మండలంలోని హరిపాలెం, పెదపాడు గ్రామాలలో బుధవారం ఉపాధి పనులు చేసే ప్రదేశాలకు ఆయన వెళ్లి కూలీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీలు పనిచేసే చోట సేద తీరడానికి టెంట్లు వేయాలని, ఫస్ట్‌ ఎయిడ్‌ పరికరాలు అందుబాటులో ఉంచాలని కోరారు. మౌలిక సదుపాయాలు లేక ఇటీవల పనిచేసే చోట ఉపాధి కూలీ మృతి చెందిన విషయాన్ని గుర్తు చేశారు. పాముకాటుకు మందులు అందుబాటులో ఉన్నట్లయితే రక్షించడానికి వీలవుతుందన్నారు. కూలీల దాహం తీర్చడానికి మజ్జిగ ప్యాకెట్లు, మంచినీరు అందించాలని కోరారు. మండుటెండలో పనిచేస్తున్న కూలీలకు అదనంగా 30శాతం వేతనం ఇవ్వాలని, కొలతలతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రోజు కూలి రూ.300 చెల్లించాలని, ప్రతి కుటుంబానికి ఏడాదికి 200 పని దినాలు కల్పించాలని, వేతన స్లిప్పులు ఇవ్వాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి చేసిన కూలీ డబ్బులు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో శంకర్రావు, వెంకటరత్నం, మంగ, రామలక్ష్మి, పుష్ప తదితరులు పాల్గొన్నారు.

➡️