జిందాల్‌ కార్మికుల నిరసన

Jun 14,2024 20:04

 పరిశ్రమ నుంచి పాదయాత్ర

అంబేదర్కర్‌ జంక్షన్‌ వద్ద నిరసన

లే ఆఫ్‌ ఎత్తివేసే వరకు పోరాటం : నాయకులు

ప్రజాశక్తి- కొత్తవలస : జిందాల్‌ పరిశ్రమలో లే ఆఫ్‌ ఎత్తివేసి కార్మికులందరికీ భేషరతుగా పని కల్పించాలని జిందాల్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్ల జెఎసి నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు జెఎసి ఆధ్వర్యాన శుక్రవారం కార్మికులు జిందాల్‌ గేట్‌ నుంచి నిమ్మలపాలెం, అడ్డుపాలెం, తుమ్మకాపల్లి మీదుగా కొత్తవలస జంక్షన్‌ వరకు పాదయాత్ర చేశారు. అనంతరం కొత్తవలస అంబేద్కర్‌ జంక్షన్‌లో రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ఎపి ఫెర్రో ఎల్లాయిస్‌ వర్కర్స్‌ కోఆర్డినేషన్‌ కమిటీ (సిఐటియు) రాష్ట్ర కన్వీనర్‌ టివి రమణ, వైఎస్‌ఆర్‌ టియుసి నాయకులు నెక్కల నాయుడుబాబు మాట్లాడుతూ గత 40ఏళ్ల నుంచి జిందాల్‌ కార్మికులతో వెట్టి చాకిరి చేయించుకొని, చివరికి యాజమాన్యం బయటికి నెట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు.

కార్మికులు వేతనాలు పెంచాలని గాని, ఏ ఇతర అలవెన్స్‌ లు పెంచాలని గాని కోరలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కంపెనీలో ముడిసరుకు కొరత సాకుగా చూపి, యాజమాన్యం కంపెనీని అర్ధాంతరంగా లే ఆఫ్‌ ప్రకటించడాన్ని తప్పుపట్టారు. విశాఖపట్నం డిసిఎల్‌, విజయనగరం ఎసిఎల్‌ వద్ద జరిగిన చర్చలలో వారిచ్చిన సూచనలు, సలహాలు పాటించడానికి యాజమాన్యం వెనుకడుగు వేసిందని అన్నారు. యాజమాన్యం భేషరతుగా కంపెనీని తెరవాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికీ జిందాల్‌ యాజమాన్యం దిగిరాని పక్షంలో ప్రజలను చైతన్య పరచి, పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు గాడి అప్పారావు, నమ్మి చినబాబు, బాలిబోయిన ఈశ్వరరావు, బొట్ట రాము, టిఎన్‌టియుసి నాయకులు పిల్లా అప్పలరాజు, సలాది భీమయ్య, వైఎస్‌ఆర్‌ టియుసి నాయకుడు లగుడు వామాలు, భూసాల అప్పారావు, జిడి నాయుడు, బి.వెంకటరావు కార్మికులు పాల్గొన్నారు.

➡️