ఉద్యోగ భద్రత కల్పించాలి

ప్రజాశక్తి-కొండపి: ఆంధ్రప్రదేశ్‌లో గత 10 నుంచి 20 సంవత్సరాలుగా 1,800 మంది సాంకేతికంగా శిక్షణ పొంది కంప్యూటర్‌ ఆపరేటర్లుగా గ్రామ పంచాయతీలలో పని చేస్తున్న సిబ్బందికి మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ పద్ధతి ద్వారా ఉద్యోగ భద్రత కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామికి గ్రామ పంచాయతీ ఆపరేటర్లు కోరారు. సోమవారం తూర్పునాయుడు పాలెంలోని ఆయన స్వగృహంలో గ్రామ పంచాయతీ ఆపరేటర్లు వినతిప్రతం మంత్రి స్వామికి అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో ఖాళీగా ఉన్న జానియర్‌ అసిస్టెంట్‌ బిల్లు కలెక్టర్‌ పోస్టులు టైమ్‌ స్కేల్‌ ప్రకారం విద్య అర్హత ప్రాధాన్యతతో ఇప్పించాలని, గ్రామ పంచాయతీల్లో కేవలం రూ.15 వేలు జీతం పొందుతూ పిల్లల చదువులు, కుటుంబ ఖర్చులతో ఆర్థికంగా ఇబ్బంది పడుతూ కుటుంబ జీవనోపాధిని పోషించుకొనేందుకు కష్ట సాధ్యంగా ఉన్నదని మంత్రికి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్లను టిడిపి ప్రభుత్వంలో నియమించడం, జీతాలు పెంచడం జరిగిందే తప్ప గత ప్రభుత్వం వారు తమకు బదులుగా డిజిటల్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-6 తీసుకొని తమకు తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. మా వినతిపత్రం చూసి మాకు తగు న్యాయం చేయాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కంప్యూటర్‌ ఆపరేటర్లు పాల్గొన్నారు.

➡️