సిపిఎం గెలుపుతోనే గిరిజనులకు న్యాయం

May 6,2024 21:57

ఓటు అడిగే హక్కు బిజెపి, వైసిపి, టిడిపిలకు లేదు

గిరిజన సమస్యలపై ఏనాడూ నోరు మెదపలేదు

సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌

గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురంలో భారీ ర్యాలీ

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం టౌన్‌ : ఇండియా వేదిక బలపర్చిన సిపిఎం, కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపుతోనే గిరిజనులకు న్యాయం జరుగుతుందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ అన్నారు. గిరిజన సమస్యలపై ఏనాడూ నోరు మెదపని బిజెపి, వైసిపి, టిడిపిలకు ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుమ్మలక్ష్మీపురంలో జరిగిన సభలోను, పార్వతీపురంలో జరిగిన రోడ్డుషోలోనూ ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా సహా ప్రజా సమస్యలపై మాట్లాడలేదని అన్నారు. టిడిపి కూడా ఏనాడూ ప్రశ్నించలేదన్నారు. మోడీ ప్రభుత్వం కూడా హోదా కోసం ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదన్నారు. రైతులు, కార్మికులు, గిరిజనుల హక్కులను బిజెపి ప్రభుత్వం కాలరాసిందన్నారు. బిజెపితో టిడిపి, జనసేన పొత్తు, వైసిపి తొత్తు పచ్చి అవకాశవాదమని అన్నారు. బిజెపి నుంచి దేశాన్ని రక్షించడానికి 22పార్టీలు కలిసి ఇండియా వేదికగా ఏర్పడ్డాయని తెలిపారు. బిజెపి పదేళ్ల పాలనలో రాజ్యాంగం పూర్తిగా నాశనమైందని అన్నారు. అదాని, అంబానీ వంటి కార్పొరేట్‌ వ్యక్తుల సంక్షేమమే ధ్యేయంగా బిజెపి పాలన సాగిందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలైన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌, రైల్వేను ప్రైవేటు పరం చేసేందుకు కుట్రలు పన్నుతోందన్నారు. మతం పేరుతో పాలన సాగిస్తూ ప్రాంతాలను విడదీసి ప్రజల మధ్య చిచ్చు పెడుతుందని అన్నారు. గత ఎన్నికల్లో 23 మంది వైసిపి ఎంపీలు పార్లమెంట్‌లో బిజెపి ప్రభుత్వానికి భయపడి మాట్లాడకుండా నోటికి ప్లాస్టర్లు వేసుకున్నారని విమర్శించారు. గిరిజనుల సమస్యలపై పోరాడే ఎంపి అభ్యర్థి అప్పలనర్సకు, ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణకు, పార్వతీపురం కాంగ్రెస్‌ అభ్యర్థి బత్తిన మోహనరావుకు ఓటు వేసి పార్లమెంటు, అసెంబ్లీకి పంపించాలని పిలుపునిచ్చారు.

అరకు ఎంపీ అభ్యర్థి అప్పలనర్స మాట్లాడుతూ బిజెపి పదేళ్లు పాలనలో రాజ్యాంగాన్ని పూర్తిగా నాశనం చేస్తూ గిరిజనుల హక్కులు, చట్టాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మళ్లీ బిజెపి అధికారంలోకి వస్తే గిరిజనులను అడవి నుంచి దూరం చేయడం ఖాయమన్నారు. గ్రామ సభలు ఏర్పాటు చేయకుండా కార్పొరేట్‌ వ్యక్తులకు కంపెనీల పేరుతో విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడం దుర్మార్గపు చర్య అన్నారు. గిరిజనులకు ఇంత అన్యాయం జరుగుతున్నా వైసిపి, టిడిపి ప్రశ్నించలేని స్థితిలో ఉన్నాయని అన్నారు. గిరిజన ద్రోహులుగా మిగిలిపోయే పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా నిరంతరం గిరిజనుల సమస్యలపై పోరాడే తమను ఆశీర్వదించి అసెంబ్లీకి, పార్లమెంట్‌కు పంపించాలని కోరారు.

కురుపాం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 77 ఏళ్లు గడిచినా నేటికీ గిరిజన గ్రామాలు రోడ్లు లేకపోవడంతో గిరిజనులకు డోలీ కష్టాలు తప్పడం లేదన్నారు. గిరిజన విద్య, వైద్యం, తాగునీరు గిరిజనులకు అందడం లేదన్నారు. కోరన్న, మంగన్న, వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం పోరాట ఫలితంగా ఏర్పడిన ఐటిడిఎ, జిసిసిలను పాలక పార్టీలు నిర్వీర్యం చేయడం వల్ల గిరిజనులకు ఏమాత్రం మేలు జరగడం లేదన్నారు. గత 17ఏళ్లుగా కురుపాం నియోజకవర్గంలో ఏనుగుల సమస్య ఉన్న వైసిపి, టిడిపి ప్రభుత్వాలు వాటిని తరలించడంలో విఫలమయ్యాయని అన్నారు.

సిపిఎం సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ మతతత్వ పార్టీ బిజెపిని రానున్న ఎన్నికల్లో ఓడించినప్పుడే రాజ్యాంగానికి, ప్రజలకు రక్షణ ఉంటుందని అన్నారు. వైసిపి, టిడిపి కి ఓటు వేస్తే బిజెపికి ఓటు వేసినట్టే అవుతుందన్నారు. ఇప్పటికైనా గిరిజనులు మేల్కొని గిరిజన పక్షాన పోరాడేది ఎవరో గుర్తించి ఓటు వేయాలని అభ్యర్థించారు. సిపిఎం మన్యం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.గంగునాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌ నరసింగరావు, కె.సుబ్బరావమ్మ, పార్టీ మన్యం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు మాట్లాడారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కోరంగి మన్మధరావు, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోలక అవినాష్‌, విజయనగరం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు, నాయకులు ఎం.శ్రీనివాసరావు, పి.తిరుపతిరావు, కె.గౌరీశ్వరరావు, పి మోహన్‌ రావు, అశోక్‌, పార్వతీపురంలో కాంగ్రెస్‌ అసెంబ్లీ అభ్యర్థి బత్తిన మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

సాయంత్రం పార్వతీపురం పట్టణంలో రోడ్డుషో నిర్వహించారు. ఆర్‌టిసి కాంప్లెక్సు నుంచి మెయిన్‌రోడ్డు మీదుగా పాత బస్టాండ్‌ వరకు ఈ ర్యాలీ సాగింది. రోడ్డుషోలో సిపిఎం నాయకులు బృందాకరత్‌, ఎంపి అభ్యర్థి అప్పలనర్స, నాయకులు సుబ్బరావమ్మ, కాంగ్రెస్‌ అభ్యర్థి బత్తిన మోహన్‌రావు పాల్గొన్నారు. వీరికి కోలాటం, డప్పుల వాయిద్యాలతో డప్పులతో కళాకారులు స్వాగతం పలికారు.

➡️