ప్రమాద బాధితునికి న్యాయం చేయాలి

May 18,2024 23:30 #steel citu
steel citu

 ప్రజాశక్తి-ఉక్కునగరం : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కోక్‌ ఓవెన్‌ డిపార్టుమెంట్‌లో వివిఎస్‌ ఎంటర్‌ ప్రైజస్‌ కంపెనీ వద్ద స్కిల్డ్‌ కార్మికుడు జె సాంబయ్య నిలబడినిలబడి ఎలక్ట్రికల్‌ పనులు చేస్తున్న చోట ట్యాంకుపైనున్న షీట్‌ విరిగి పోవటంతో ట్యాంకులో ఉన్న వేడి నీటిలో పడి 80 శాతం కాలిపోవడానికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని స్టీల్‌ ప్లాంట్‌ కాంట్రాక్టు లేబర్‌ యూనియన్‌ (సిఐటియు) గౌరవాధ్యక్షులు ఒవి.రావు అన్నారు. కార్మికునికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం కోక్‌ ఓవెన్‌ హెచ్‌ఒడి ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్కిల్డ్‌ కార్మికులకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇఎస్‌ఐ సీలింగ్‌ రూ.21 వేలకు మించి పెంచకపోవడంతో వారికి వైద్య సౌకర్యం లేదన్నారు. యాజమాన్యమే బాధ్యత వహించాలన్నారు. భద్రతా చర్యలు సరిగా లేకపోవడంతో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం హెచ్‌ఒడి జిఎం దుర్గాప్రసాద్‌ను కలిసి మాట్లాడారు. మెరుగైన వైద్యం కోసం యాజమాన్యం బాధ్యత తీసుకుంటుందని, సెవెన్‌ హిల్స్‌ ఆసుపత్రికి రిఫర్‌ చేసినట్లు దుర్గాప్రసాద్‌ చెప్పారని తెలిపారు. యాజమాన్యం హామీని నిలబెట్టుకోవాలని, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు జి.శ్రీనివాసరావు, నమ్మి రమణ, నాయకులు యు.సోమేష్‌, పి.మసేను, పైడిరాజు, అంకంరెడ్డి శ్రీను, నమ్మి దేవుడు, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

➡️