‘అభ్యుదయకవి వైసివి రెడ్డి’

ప్రజాశక్తి – కడప అర్బన్‌
విజ్ఞానదాయక, చురుకైన కవితలు, కథలు, కాలమ్స్‌ రాసిన గట్టిగింజల్లాంటి అభ్యుదయకవి వైసివిరెడ్డి అని సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య టి.రామప్రసాదరెడ్డి పేర్కొన్నారు. సోమవారం యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం వైసివిరెడ్డి 99వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించింది. ముందుగా ఆచార్య టి.రామప్రసాదరెడ్డి, పరిశోధన కేంద్రం సిబ్బంది, పాఠకులు కలసి వైసివిరెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసివిరెడ్డిగా ప్రసిద్ధులైన యమ్మనూరు చిన్న వెంకటరెడ్డి సమగ్ర సాహిత్యం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన ప్రసిద్ధకవి కొడవలూరు రామచంద్రరాజు వద్ద మొదట సంప్రదాయ సాహిత్యంపై పట్టు సంపాదించారని పేర్కొన్నారు. సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డాక్టర్‌ చింతకుంట శివారెడ్డి మాట్లాడుతూ ‘సరస్వతీపుత్ర’ డాక్టర్‌ పుట్టపర్తి నారాయణాచార్యులు అంతటివాడు ప్రశంసించాడంటే వైసివి కవితాపాండిత్యాలు ఎంత గొప్పవో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఆయన మొదటి పద్యం గుత్తిలో విద్యార్థిగా ఉన్నప్పుడు రచించారని, కొన్ని అష్టావధానాలు చేసి మానివేశారన్నారు. కొత్తపల్లె రామాంజనేయులు మాట్లాడుతూ వైసివి రచించిన కడుపుమంట అనే కవితా ఖండిక ద్వారా ఆయన రచనా ప్రతిభను తెలియజేశారు. కార్యక్రమంలో సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం గ్రంథ పాలకులు జి.హరిభూషణ రావు, జూనియర్‌ అసిస్టెంట్లు ఆర్‌.వెంకట రమణ, పాఠకులు రామ్‌ మదన్‌, ఆంజనేయులు, మహేష్‌, గంగాధర్‌, అశోక్‌రాజు, శ్రీరాములు, దిలీప్‌ పాల్గొన్నారు.

➡️